విజయదశమి నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ల మధ్య కీలక భేటీ జరిగింది. రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఎదురుగా ఉన్న హోటల్ మంజీరలో జరిగిన జనసేన-టీడీపీ సమన్వయ కమిటీ తొలి సమాశానికి టీడీపీ, జనసేన లకు చెందిన కీలక నేతలు పాల్గొన్నారు. ఈ భేటీ తర్వాత పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం అస్థిరతకు గురైందని, వైసీపీ తెగులు, చీడలకు జనసేన-టీడీపీ కూటమే వ్యాక్సిన్ అని అన్నారు. చంద్రబాబు ఉన్న జైలుకు సమీపంలోని హోటల్ లో ఈ సమావేశం నిర్వహించడానికి ప్రత్యేక కారణం ఉందని, చంద్రబాబుకు మానసికంగా మద్దతునిచ్చేందుకు ఇక్కడే భేటీ అయ్యామని తెలిపారు.
వైసీపీ ప్రభుత్వ అరాచక విధానాలను ఖండించాలని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు. అస్థిరతకు గురైన రాష్ట్రానికి సుస్థిరతనివ్వాలని, ఓట్లు చీలకూడదని అనుకున్నానని పవన్ చెప్పారు. చంద్రబాబు వంటి ప్రతిపక్ష నేతలను అక్రమ కేసుల్లో జైలుకు పంపడం, కేసులతో భయభ్రాంతులకు గురి చేయడం వైసీపీ ప్రభుత్వానికి అలవాటైందని మండిపడ్డారు. 74 ఏళ్ల వయసున్న చంద్రబాబు వంటి సీనియర్ రాజకీయవేత్తను జైల్లో పెట్టి హింసలకు గురి చేస్తున్నారని, బెయిల్ రాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దారుణాలు చేసే వ్యక్తులకు బెయిల్ వస్తుందని, అకారణంగా జైలు పాలైన చంద్రబాబుకు బెయిల్ రావడం లేదని ఆరోపించారు..
ఎన్నికలకు 150 రోజులు సమయం మాత్రమే ఉందని, టీడీపీ-జనసేన ఉమ్మడి కార్యచరణపై అభిప్రాయాలు పంచుకున్నామని అన్నారు. జనసేన-టీడీపీ మేనిఫెస్టోలోని అంశాలను కలిపి ఉమ్మడి మేనిఫెస్టోపై కసరత్తు చేశామని, దాదాపు 3 గంటలపాటు ఈ భేటీ జరిగిందని అన్నారు.