జమిలి ఎన్నికలు….గత కొంత కాలంగా ఈ పేరు దేశ రాజకీయాల్లో వినిపిస్తూనే ఉంది. ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’.. ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు అనే నినాదాన్ని బిజెపి బలంగా వినిపిస్తోంది. అయితే పేపర్ల మీద అద్భుతంగా కనిపిస్తున్న జమిలి ఎన్నికల వ్యవహారం ప్రాక్టికల్ గా అమలు చేయడానికి ఎన్నో అడ్డంకులు ఉంటాయని పలు రాజకీయ పార్టీల నేతలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా, ఈ జమిలి ఎన్నికల వ్యవహారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దగ్గరకు చేరడంతో త్వరలోనే జరగబోయే పార్లమెంటు సమావేశాలలో జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెడతారని గట్టిగా ప్రచారం జరుగుతుంది.
ఈ నేపథ్యంలోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎన్డీఏ మిత్రపక్షంగా ఈ విధానానికి జనసేన సంపూర్ణ మద్దతు ఉంటుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని పవన్ అభిప్రాయపడ్డారు. ప్రజాధనం వృథా కాకుండా జమిలి ఎన్నికలు అడ్డుకుంటాయని అన్నారు. ఈ తరహాలో ఎన్నికలు జరగడం వల్ల భద్రతా బలగాలు దేశ రక్షణపైనే పూర్తిస్థాయిలో దృష్టి పెట్టగలుగుతాయని చెప్పారు. జమిలి ఎన్నికలు దేశానికి కొత్త కాదని, 1952, 1957, 1962, 1967 సంవత్సరాల్లో దేశమంతా ఒకేసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు.
ఆ తర్వాత పరిణామాల వల్ల ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక సమయంలో ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. ఇలా, ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నికలు జరగడం వల్ల పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక అభివృద్ధి వంటి విషయాలపై ప్రభుత్వం దృష్టి పెట్టలేకపోతోందని అభిప్రాయపడ్డారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిగితే దేశాభివృద్ధిపైనే ప్రజల చర్చ జరుగుతుందని అన్నారు. 1983లో లోక్ సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరగాలని అప్పట్లో కేంద్ర ఎన్నికల సంఘం కూడా అభిప్రాయపడిందని గుర్తు చేశారు. 1999లో లా కమిషన్ చైర్మన్ గా ఉన్న జస్టిస్ బీపీ జీవన్ రెడ్డి కూడా తన నివేదికలో ఇదే విషయాన్ని ప్రస్తావించారని గుర్తు చేశారు.