కుప్పం పర్యటనలో చంద్రబాబు నాయుడు చేసిన లవ్ ప్రపోజల్ కు జనసేన అధినేత పవన్ కల్యాన్ రిప్లై ఇచ్చారు. పార్టీ నేతలతో టెలి కాన్ఫరెన్సులో మాట్లాడుతూ పొత్తుల విషయంలో ఎవరి మైండ్ గేమ్ లోను పడద్దని గట్టిగా చెప్పారు. పొత్తులపై ఎవరేమి మాట్లాడినా, మైండ్ గేమ్ ఆడినా మనం మాత్రం పావులు కావద్దని హెచ్చరించారు. ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న కారణంగా ఎవరిష్టం వచ్చినట్లు పొత్తులపై మాట్లాడవద్దని హెచ్చరించారు.
పొత్తులపైన కన్నా ముందుగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకునే విషయమై చర్యలు తీసుకోవాలని పవన్ సూచించారు. మనతో పొత్తులు పెట్టుకునేందుకు చాలా పార్టీలు రెడీగా ఉండచ్చన్నారు. పొత్తుల విషయంలో తానొక్కడినే నిర్ణయం తీసుకోనని కూడా పవన్ స్పష్టంగా చెప్పారు. అందరితోను చర్చించిన తర్వాతే పొత్తుల విషయాన్ని నిర్ణయించుకోవాలన్నారు.
అంటే తాజాగా పవన్ చెప్పిన మాటలను చూస్తుంటే చంద్రబాబు లవ్ ప్రపోజల్ కు సమాధానం ఇవ్వటానికి పవన్ మరింత సమయం తీసుకునేట్లే ఉన్నారు. ఇప్పటికే బీజేపీతో పొత్తుల్లో ఉన్నామని అంటే మరే పార్టీతో పొత్తు అవసరం లేదని అర్ధమా ? లేకపోతే బీజేపీతో మాత్రమే పొత్తుంటే సరిపోదని అర్ధమా ? తెలీటం లేదు. ఏదేమైనా టీడీపీతో పొత్తుల విషయమై మాట్లాడేందుకు ఇంకా చాలా సమయం ఉందని పవన్ చెప్పారు. అంతేకానీ టీడీపీతో పొత్తు ఉండదని చెప్పలేదు.
క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా తయారవుతోందని పవన్ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడ చూసినా జనసేన జెండాలు రెపరెప లాడుతున్నట్లు చెప్పారు. పార్టీ బలోపేతమైందనేందుకు పవన్ కున్న ఆధారం ఏమిటో తెలీదు. మొన్నటి స్ధానిక సంస్థల ఎన్నికల్లో జనసేన కొన్ని ఎంపీటీసీ స్ధానాల్లో గెలవటం వాస్తవమే. అయితే అది స్ధానికంగా టీడీపీతో జరిగిన సర్దుబాట్ల కారణంగా మాత్రమే గెలిచింది. పేరుకు బీజేపీతో పొత్తులు పేరుకుమాత్రమే ఉంది.
మొన్నటి స్ధానికసంస్ధల ఎన్నికల్లో అవకాశం ఉన్నచోట్ల బీజేపీతో కాకుండా టీడీపీతోనే సర్దుబాట్లు చేసుకోవటంలో అర్ధమేంటి ? ఇపుడు బీజేపీతో పొత్తుందని చెప్పిన పవన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఏ ఆందోళనలో కూడా బీజేపీతో కలిసి చేయలేదు. అలాగే బీజేపీ కూడా నిరసనలు, ఆందోళనలన్నీ ఒంటిరిగానే చేసింది కానీ జనసేనతో కలవలేదని అందరికీ తెలుసు. మొత్తానికి తన లవ్ ప్రపోజల్ కు చంద్రబాబు కొంతకాలం వెయిట్ చేయక తప్పేట్లు లేదు.