ఒక రాజకీయ నేతలో ఏమున్నా లేకున్నా అనిశ్చితి మాత్రం ఉండకూడదు. అలాంటి గుణాన్ని ప్రజలు అస్సలు ఇష్టపడరు. విషయం ఏదైనా క్లారిటీగా ఉండాలి. జనసేన అధినేత పవన్ విషయంలో మొదట్నించి ఇదే ఇబ్బందిగా మారుతోంది.
ఏదైనా విషయం మీద ఆయన ఒక నిర్ణయాన్ని ఎప్పుడు తీసుకుంటారో? మరెప్పుడు వెనక్కి తీసుకుంటారో అస్సలు అర్థం కాని పరిస్థితి. తాజాగా కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు ప్రసారం చేస్తున్న వార్తల ప్రకారం.. ప్రస్తుతం సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న పవన్.. మరోసారి సినిమాలకు బ్రేక్ చెప్పనున్నట్లు చెబుతున్నారు.
సినిమాలు.. రాజకీయాలు రెండు పడవల మీద ప్రయాణం మామూలు విషయం కాదు. పవన్ లాంటి వారికి అది మరింత కష్టం. కానీ.. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఈ ఇబ్బందిని అధిగమించే వీలుంది. కానీ.. పవన్ మాత్రం కొన్నిసార్లు రాజకీయాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని భావించటం.. మరోసారి పార్టీని బతికించుకునేందుకు అవసరమైన ఆర్థిక బలం కోసం సినిమాలు చేయాలనుకోవటం లాంటి వైరుధ్య ఆలోచనలతో తనకు తాను కన్ఫ్యూజ్ కావటంతో పాటు.. తన అభిమానుల్ని.. ఫాలోయర్స్ ను ఇబ్బందికి గురి చేస్తుంటారన్న విమర్శ ఉంది.
ఇందుకు తగ్గట్లే తాజాగా మరోసారి ఆయన సినిమాలకు బ్రేక్ చెప్పాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. అదే జరిగితే.. ఆయన ప్రత్యర్థులకు ఇది వరంలా మారుతుందనటంలో సందేహం లేదు.
ఇప్పటికే ఎప్పుడు ఏ నిర్ణయాన్ని తీసుకుంటారన్న దాని మీద పవన్ కుక్లారిటీ లేదన్న విమర్శ బలంగా వినిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆయన భీమ్లానాయక్ తో పాటు మరో మూడు సినిమాల్ని బ్యాక్ టు బ్యాక్ చేసేందుకు ఇప్పటికే ఓకే చేశారు.
కానీ.. ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. ఎక్కువసేపు పార్టీ కోసం సమయం కేటాయించాల్సి వస్తుందని.. అందుకే సినిమాలకు బ్రేక్ ఇవ్వాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసిన తర్వాత కొత్త సినిమాల్ని ఒప్పుకునే అవకాశం లేదంటున్నారు.
2024 ఎన్నికలకు కొన్ని నెలల ముందే పూర్తిస్థాయి రాజకీయాలకు సమయాన్ని కేటాయించాల్సి ఉంటుందని.. అందుకే.. ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాల్ని పూర్తి చేసి.. రాజకీయాల మీదే పూర్తిగా ఫోకస్ చేస్తారన్న మాట వినిపిస్తోంది.
అయితే.. పవన్ ను అటు రాజకీయంగా.. ఇటు సినిమాల పరంగా రెండింటిని బ్యాలెన్సు చేయటం.. నెమ్మదిగా ఒక రంగానికి పరిమితం కావటం బాగుంటుంది కానీ..అయితే స్విచ్ ఆన్.. లేదంటే స్విచ్ ఆఫ్ అన్నట్లు సరికాదంటున్నారు. మరి.. ఈ ప్రచారంపై పవన్ అండ్ కో ఏలా రియాక్టు అవుతుందో చూడాలి.