ఎవరు అవునన్నా.. కాదన్నా తెలుగు రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక ప్రత్యేక పేజీ. సినిమాల్లో తిరుగులేని హీరోగా ఉండి.. అమితమైన ఆదరాభిమానాలతో ఉండే ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వటం.. జీరోగా నిలవటం తెలిసిందే. ఆ మాటకు వస్తే.. పవన్ కు ఓటమే కలిసి వస్తుందనుకోవాలి. ఆయన నటించిన మొదటి చిత్రం అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి. ఆ సినిమా ఆశించినంతగా ఆడలేదు. రెండో సినిమా ఓకే. తర్వాత తన అన్న చిరంజీవి ముద్ర నుంచి బయటకు వచ్చిన ఆయన.. ఆ తర్వాత తానేమిటో.. తన సత్తా ఏమిటో చాటారు.
రాజకీయాలు కూడా అంతే.. తన అన్న చిరంజీవి నీడలో పెరిగిన మొక్కగా ఉన్నప్పుడు ఆయన పెద్దగా ఫోకస్ కాలేదు. ఆ తర్వాత చిరంజీవి ముద్ర ఆయన్నువెంటాడింది. దాని నుంచి బయట పడేందుకు.. ఆయన పదేళ్లు కష్టపడాల్సి వచ్చింది. అయినప్పటికీ తాను అమితంగా ప్రేమించి.. అభిమానించి.. ఆరాధించే తన అన్నను కించిత్ మాట అనలేదు. అన్న పేరు మీద తమ్ముడ్ని నానా మాటలు అంటున్నా..ఆయన ఫీల్ కాలేదు. అదీ.. పవన్ అంటే.
సమకాలీన రాజకీయాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పదవి కోసం భర్త మీద భార్య.. తండ్రి మీద కొడుకు పోటీ చేసే రోజులు. అలాంటప్పుడు తన చేతికి తిరుగులేని అధికారం వచ్చే పరిస్థితి ఉన్నా.. తనకు తన సోదరుడు.. తాను ఏదో చేయాలన్న ప్రజలు సమంగానే చూశారే తప్పించి.. ప్రజల పేరు చెప్పి అన్నను పక్కన పెట్టేయలేదు. రామాయణంలో రాముడికి లక్ష్మణుడి మాదిరి.. చిరంజీవికి పవన్ అలాంటోడు.
తన అన్నను ఒక ముఖ్యమంత్రి మర్యాదగా (అవమానించలేదు) చూడలేదన్న విషయాన్ని పవన్ ఎంత సీరియస్ గా తీసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్నమీద తమ్ముడికి ఉన్న ప్రేమ ఎంతన్న విషయాన్ని.. కోట్లాదిమంది చూస్తుండగానే చూపించేశారు. వేదిక మీద ఎంత పవర్ ఫుల్ వ్యక్తులున్నప్పటికీ.. తాను పెద్దపీట వేసేది మాత్రం తన అన్నకే అంటూ.. కాళ్లకు దండం పెట్టేయటం ద్వారా చెప్పేసిన పవన్.. ఈ తరపు రాజకీయాలకు భిన్నమైన వ్యక్తి కాదని చెప్పగలమా?
తాజాగా వరదలతో ఉక్కిరిబిక్కిరి అయిన విజయవాడ ఆయన మనసును బలంగా తాకినట్లుగా కనిపించింది. అందుకు తగ్గట్లే.. చరిత్రలో ఇప్పటివరకు ఏ ఉప ముఖ్యమంత్రి (ఆ మాటకు వస్తే ముఖ్యమంత్రి కూడా చేయలేదు) చేయని విధంగా తన వ్యక్తిగత సొమ్ముల్లో రూ.5 కోట్ల భారీ మొత్తాన్ని తాను చూస్తున్న పంచాయితీ రాజ్ శాఖకు విరాళంగా ఇచ్చారు. అక్కడితో ఆగని ఆయన.. ఏపీలో ఉన్న 400 పంచాయితీలకు ఒక్కో పంచాయితీకి రూ.లక్ష చొప్పున సాయంగా అందించారు. తమ చేతికి అధికారంలోకి వస్తే.. ప్రజల బతుకుల్ని మారుస్తామని.. అవసరమైతే తమ ప్రాణాల్ని పణంగా పెడతామని మాట్లాడే అధినేతలు.. నేతలు ఎవరూ కూడా తమ డబ్బుల్ని మాత్రం బయటకు తీసిన దాఖలాలు కనిపించవు.
అందుకు భిన్నంగా పవన్ మాత్రం.. తన సొమ్ములో నుంచి కోట్లాది రూపాయిల్ని విరాళంగా ఇవ్వటం.. రాష్ట్రంలోని అన్ని పంచాయితీలకు ఆర్థిక సాయాన్ని అందించేలా తీసుకున్న నిర్ణయాన్ని చూస్తే.. చరిత్రలో ఆయన మిగిలిపోతారని చెప్పక తప్పదు. తాను ఇచ్చిన మొత్తాన్ని ఒకే రోజున ఏపీ వ్యాప్తంగా 19 కేంద్రాల్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందించిన తీరు కూడా ఆయన్ను ఎప్పటికి మర్చిపోనివ్వదు. రాజకీయాల్లోకి వచ్చేది ప్రజాసేవ చేయటానికే అయినప్పుడు.. తన దగ్గర ఉన్న సంపదను అదే ప్రజలకు ఎందుకు ఇవ్వరు? అధికార అందలాన్ని ఎక్కించిన ప్రజలకు ఉడతా భక్తితో తన దగ్గరి సంపదను మొత్తం కాకున్నా కొంత మాత్రం కూడా ఇవ్వని రోజుల్లో.. అందుకు భిన్నంగా వ్యవహరించిన పవన్ మిగిలిన వారికి భిన్నంగా.. ఒకే ఒక్కడిగా మారారని చెప్పక తప్పదు. అందుకే పవన్ ను ఒక వ్యక్తిగా కాదు.. ఒక ఇజంగా చూసేది.