ప్రజాగళం సభలో ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ ప్రజల తరఫున పవన్ చేతులెత్తి మొక్కిన వైనం సంచలనం రేపుతోంది. వికసిత భారత్ కలలో 5 కోట్ల ఆంధ్రులు మీ వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని మోడీని కోరామని, పెద్దమనసుతో ఈ కూటమికి ఆయన ఆశీస్సులు తెలిపారని పవన్ ప్రశంసించారు. అందుకుగాను రాష్ట్ర ప్రజల తరఫున మోడీ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నానని పవన్ అన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కళాకారుల విలువ పెరిగిందని, పద్మ అవార్డులకు వన్నె తెచ్చి నిజమైన మేధావులు, కళాకారులకు అవార్డులు వచ్చేలా చేశారని అన్నారు.
సంక్షేమంతో పాటు అభివృద్ధి, ఉపాధి పరిశ్రమలు, సాగునీరు, తాగునీరు అందిస్తున్న వ్యక్తి ప్రధాని మోడీ అని కొనియాడారు. కేంద్రం అందిస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ పథకాలుగా ప్రచారం చేసుకుంటుందని, కేంద్ర పథకాలకు తమ పేర్లు పెట్టుకుంటోందని ఆరోపించారు. ఇస్ బార్ 400 పార్… ఈ సారి 400 ఎంపీ సీట్లు సాధించాలన్న నినాదంతో, లక్ష్యంతో మోడీ ముందుకు వెళుతున్నారని, అందుకు తమ వంతుగా ఏపీ నుంచి పార్లమెంటు సభ్యులను పంపుతామని అన్నారు. మోడీ పాలనలో దేశమంతా అమృత ఘడియలు నడుస్తున్నాయని, కానీ, ఏపీలో మాత్రం జగన్ పాలనలో విషపు ఘడియలు నడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఆ ఘడియల నుంచి ప్రజలకు విముక్తి కలగాలంటే మోడీ ముందుండి ఏపీని నడిపించాలని, అది తప్ప వేరే మార్గం లేదని, అందుకే మోడీ ఆశీస్సులు కోరుతున్నామని చెప్పారు.