తణుకులో జరిగిన బహిరంగ సభలో మరోసారి వాలంటీర్లపై జనసేనాని పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. ముందుగా జనసేన నేత గుడివాడ రామచంద్ర రావుకు క్షమాపణలు చెప్పిన పవన్ ఆ తర్వాత సభ ప్రారంభించారు. గతంలో తణుకు తరఫున జనసేన అభ్యర్థిగా నిలబెట్టిన వ్యక్తి ఇక్కడ లేరని, పార్టీ వదిలి వెళ్లిపోయారని అన్నారు. కానీ, సీటు ఇవ్వకపోయినా రామచంద్రరావు పార్టీతోనే, పార్టీ కోసం నిలబడ్డారని పవన్ ప్రశంసించారు. చెత్తపై పన్ను వేసిన జగన్ తణుకులో డంపింగ్ యార్డ్ కట్టలేదని విమర్శించారు.
జగన్ పాలన ఏమాత్రం బాగోలేదని, ఆయన నొక్కని బటన్ ల సంగతి ఏంటని ప్రశ్నించారు. సిపిఎస్ రద్దు చేస్తానని మాట ఇచ్చిన జగన్ కనీసం జీతాలు ఇవ్వలేక పిఎఫ్ నిధులను దారి మళ్ళిస్తున్నారని ఆరోపించారు. అమ్మఒడి నిధులు వాహన మిత్ర పథకానికి ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. వాలంటీర్లు కడుపు కొట్టే ఉద్దేశం తనకు లేదని, 5000 రూపాయలకు మరో 5000 కలిపి ఇచ్చే వ్యక్తిని తాను అని చెప్పారు. అయితే జగన్ వల్ల వాలంటీర్లు ఇబ్బంది పడతారని, తెలియకుండానే వారితో తప్పు చేయిస్తున్నారని ఆరోపించారు.
వైఎస్సార్ హయాంలో ఆయన చెప్పినట్టు విన్న ఐఏఎస్, ఐపీఎస్ లు జైలుకు వెళ్లారని, అదే తరహాలో వాలంటీర్లు కూడా ఇబ్బంది పడతారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వంలో ఒక శాఖ నుంచి మరో శాఖకు డేటా బదిలీ కావాలంటే లిఖిత పూర్వక అనుమతి ఉండాలని, వాలంటీర్లు అటువంటి అనుమతి లేకుండా డేటా కలెక్ట్ చేస్తున్నారని ఆయన అన్నారు. నువ్వు దొంగవి జగన్… అందుకే నిన్ను జగ్గుభాయ్ అంటాం అని ఎద్దేవా చేశారు. శివశివాని స్కూల్లో 10వ తరగతి పేపర్లు కొట్టేశావు కదా జగన్ అని సెటైర్లు వేశారు.
జగన్ అని ఏకవచనంలో పిలుస్తుంటే వైసీపీ నేతలు ఫీలవుతున్నారని, తనను దత్తపుత్రుడు, ప్యాకేజి స్టార్ అన్నప్పుడు ఏమయ్యారని నిలదీశారు. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుంటే తాను కూడా నోరు అదుపులో పెట్టుకుంటానని స్పష్టం చేశారు. ప్రస్తుతం జగన్ నుంచి జగ్గుభాయ్ కి వచ్చాను… ఇంకా మీరు నోరు జారితే జగ్గు అంటాను… ఆ తర్వాత ఏమని పిలుస్తానో తెలియదు అంటూ పవన్ వ్యాఖ్యానించారు.