రాష్ట్రానికి ఏ ఆదాయం ప్రతినెలా జీతాలకు, పింఛన్లకు కటకటలాడుతున్న జగన్ సర్కారుకు డబ్బులు ఎలా తేవాలో దిక్కు తెలియకుండా పోతోంది. పెట్టుబడులు రావడం లేదు. పరిశ్రమలు ప్రభుత్వాన్ని నమ్మడం లేదు. కరోనాతో ఉన్న ఆదాయం కూడా పోయింది. దీంతో జగన్ రెడ్డి సర్కారు ఇరుకున పడింది.
ఆదాయం లేక మందు రేట్లు, పెట్రోలు రేట్లు, భూముల క్రయవిక్రయ ఛార్జీల రేట్లు, రేషన్ స్టోర్లలో పప్పు రేట్లు, పెట్రోలు డీజిలుపై ట్యాక్సు, బస్సు ఛార్జీలు, దేవాలయాల్లో గదుల అద్దె చార్జీలు, పార్కింగ్ చార్జీలు పెంచినా ప్రజల వ్యతిరేకత పెరిగింది గాని ప్రభుత్వానికి చెప్పుకోదగిన ఆదాయం మాత్రం రావడం లేదు.
భూములు అమ్ముదాం అంటే నీకు హక్కు లేదంటూ కోర్టులు అడ్డుపడుతున్నాయి. మొన్న తిరుమల భూములు అమ్మడానికి ప్రయత్నిస్తే తీవ్రంగా దెబ్బ తగిలింది. అయినా సెలైంటుగా ఈసారి మంత్రాలయ భూములు అమ్మడానికి ప్రయత్నం చేస్తోంది.అయితే, దేవుడి భూములపై జగన్ కన్నేశాడంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇలాంటి చేస్టలు ఆపకపోతే ఊరుకునేది లేదంటూ ప్రతిపక్షాలు వార్నింగ్ ఇచ్చాయి.
గత ప్రభుత్వంలో బీజేపీ మంత్రి కూడా ఈ ప్రయత్నం చేసినా వద్దులే నష్టం వచ్చినా పర్లేదు అని ఆ ప్రక్రియ నిలిపివేశారు. భక్తుల మనోభావాలకే చంద్రబాబు ప్రాధాన్యం ఇవ్వడంతో అప్పుడు దేవాలయాల భూముల అమ్మకాలు ఆగిపోయాయి. కానీ జగన్ సర్కారు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా భూముల అమ్మకానికి టెండరు పిలిచింది. దీనిని చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది.
తాజాగా పవన్ దీనిపై తీవ్రంగా స్పందించారు .మంత్రాలయం మఠానికి చెందిన 208 ఎకరాల భూముల బహిరంగ వేలం, ఆస్తుల అమ్మకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అంటూ ట్విట్టరు ద్వారా హెచ్చరించారు. దేవాదాయ శాఖకు చెందిన భూములకు ప్రభుత్వం కేవలం ట్రస్టీగా మాత్రమే వ్యవహరించాలి. ఆస్తులను సంరక్షించాలి తప్ప అమ్ముకోవడానికి వీలు లేదు. దీనికి సంబంధించి హైకోర్టు తీర్పు కూడా ఉంది. ప్రజల దగ్గర నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం వల్లే తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల విక్రయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మే 25వ తేదీన టీటీడీ ఆస్తుల విక్రయాన్ని నిలుపుదల చేస్తూ జి.వో.888ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిలుపుదల ఉత్తర్వులనే రాష్ట్రంలోని అన్ని ఆలయాలు, మఠాల ఆస్తులకు వర్తింపచేయాలి. ధర్మ పరిరక్షణకు ఉద్దేశించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ పాలకుల ఒత్తిళ్లకు తలొగ్గితేనే వేలం, విక్రయం ప్రకటనలు వస్తాయి. దాతలు ఇచ్చిన ఆస్తులను నడి బజారులో అమ్మకానికిపెడితే మనోభావాలు దెబ్బతిన్న భక్తుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. దేవాలయ ఆస్తులకు ధర్మకర్తలుగా ఉండాల్సిన పాలకులు తామే యజమానులం అనుకోవద్దు.అంటూ పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లతో ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. ఈ ప్రయత్నం ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.