వారాహి విజయయాత్ర పేరుతో నిర్వహిస్తున్న గోదావరి జిల్లాల పర్యటన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్య చేశారు. తాజాగా ఆయన ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా జనసేన పార్టీ నేతల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా.. ఆయన షాకింగ్ అంశాల్ని ప్రస్తావించారు.
తనకు ప్రాణహాని ఉందని.. తనను చంపేందుకు ప్రత్యేకంగా సుపారీ గ్యాంగుల్ని దింపారనే సమాచారం ఉందన్నారు.
వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ బలంగా ఉందని.. వైసీపీ పాలకుల్ని గద్దె దింపే దిశగా పయనిస్తోందన్న ఆయన.. ‘ఇలాంటి సమయంలో వారు ఏం చేయటానికైనా సిద్ధపడతారు. అధికారం పోతుందనే భావన నాయకులను క్రూరంగా మార్చేస్తుంది. ఎంతకైనా తెగిస్తారు’’ అని వ్యాఖ్యానించారు.
తనను భయపెట్టే కొద్దీ మరింత రాటుదేలుతానని చెప్పిన ఆయన.. గతంలో కాకినాడ ఎమ్మెల్యే అనుచరులు జనసైనికులు.. వీర మహిళల మీద చేసిన దాడిని తాను మర్చిపోనన్నారు. బలమైన కార్యాచరణ లేని కారణంగా అప్పట్లో వెనుకడుగు వేశామని.. సరైన సమాధానం చెప్పే రోజు కచ్ఛితంగా వస్తుందన్నారు.
జనసేన నాయకులతో పాటు జనసైనికులు.. వీర మహిళలు కచ్ఛితంగా భద్రతా నియమాల్ని పాటించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్తానాల్లో వైసీపీకి ఒక్కటీ కూడా దక్కకూడదని స్పష్టం చేసిన పవన్ కల్యాణ్.. తాను సినీ నటుడ్ని కాకుంటే.. బలమైన నాయుకడిలా జనంలోకి చొచ్చుకు వెళ్లేవాడినన్నారు. అభిమానుల తాకిడి తనను అడ్డుకుంటోందన్న ఆయన.. అభిమానమే ప్రతిబంధకంగా మారినట్లు వ్యాఖ్యానించారు.
Highlights from yesterday's Pithapuram meeting..#VarahiVijayaYatra pic.twitter.com/JuuJtWkha9
— JanaSena Party (@JanaSenaParty) June 17, 2023