ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో మసులుకోవడం అంటే.. అంత ఈజీకాదు. ఆయన చెప్పింది చేయాలి. ఆయనకు ఎదురు చెప్పకూడదు. అలాగని ఆయనను ఉత్తి పుణ్యాన పొగడనూ కూడదు. ఆయన విషయంలో ఎప్పుడు ఎలా వ్యవహరించాలో.. చాలా అధ్యయనం.. దానికి తగిన అభ్యాసం రెండూ ఉండాలని అంటారు పరిశీలకులు. బహుశ ఈ విద్యను అప్పుడే నేర్చేసుకుని ఉంటారు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తాజాగా మోడీ `మనసెరిగి` మరీ పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మోడీ తన మనసులోని భావాలను ప్రజలతో పంచుకునే ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ఈ ఆదివారం(ఈ నెల 30)తో 100 ఎపిసోడ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మోడీకి అభినందనలు వెల్లువెత్తున్నాయి. దీనిని పురస్కరించుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మోడీకి శుభాభినందనలు తెలిపారు. దేశ ప్రధాని దేశవాసులతో రేడియో మాధ్యమం ద్వారా స్వయంగా ముచ్చటించే ఈ కార్యక్రమం.. శ్రోతలకు, తదుపరి టీవీ ప్రసారాల్లో చూసే వీక్షకులకు ఎంతో చేరువైందన్నారు.
ఇప్పటివరకు ఈ కార్యక్రమాన్ని 100 కోట్ల మంది ప్రజలు ఒక్కసారైన రేడియోలో వినడమో, టీవీలో చూడటమో జరిగిందని పవన్ తెలిపారు. ప్రతి నెల 23 కోట్ల మంది ఆదరిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. మోడీ ఈ కార్యక్రమంలో ప్రస్తావించే అంశాలు చాలా విభిన్నంగా ఉంటాయని పవన్ పేర్కొన్నారు. సామాన్యులు సాధించే విజయాలు, గొప్ప వ్యక్తులు, కళలు, చేతివృత్తులు, సేవా కార్యక్రమాలు, ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు… ఇలా అనేక అంశాలు ఈ కార్యక్రమాన్ని ప్రజలకు దగ్గర చేశాయని చెప్పారు.
ముఖ్యంగా ఈ కార్యక్రమం ప్రారంభ సందేశంలో “సేవా పరమో ధర్మః” అని మోడీ పేర్కొనడం మనసులను హత్తుకునే విధంగా ఉందని పవన్ కొనియాడారు. ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. సరే.. ఇదేముంది.. ఎవరైనా చెబుతారులే అనుకుంటున్నారా.. అనుకోవచ్చు. కానీ.. పవన్ ఈ ప్రకటన చేయగానే.. పీఎంవో రియాక్ట్ అయింది. పవన్ కు రిటన్ ధన్యవాదాలు తెలిపింది. ఇదీ.. మరి మోడీ మనసెరిగి మసులుకోవడం అంటే!!