వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబంపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. కడప జిల్లా సీకేదిన్నె మండల పరిధిలోని అటవీ భూముల్లో ఏకంగా 52 ఎకరాలను కబ్జా చేయడమే కాకుండా పేదల చుక్కల భూములనూ ఆక్రమించుకుని ఎస్టేట్ తయారు చేసుకున్నారని ఆరోపణలు రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
అయితే సజ్జల భూ కబ్జాల వ్యవహారంపై కూటమి ప్రభుత్వం సీరియస్ అయింది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం ఆధీనంలో ఉన్న భూముల్లో ఎంత మేర అటవీ ప్రాంతం ఉందో విచారణ చేపట్టి పూర్తి నివేదిక ఇవ్వాలని అటవీ, రెవెన్యూ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సజ్జలకు ఉచ్చు బిగుసుకున్నట్లు అయింది.
కాగా, పేదల, ప్రభుత్వ భూముల జోలికి ఎవరు వచ్చినా సహించేది లేదని.. చట్ట ప్రకారం సీరియస్ యాక్షన్ ఉంటుందని ఈ సందర్భంగా పవన్ హెచ్చరించారు. ఉపముఖ్యమంత్రి ఆదేశాలతో ఇప్పటికే విచారణ నిమిత్తం ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. సజ్జల కుటుంబం భూములను సర్వే చేస్తున్నారు.