ఎక్కడ ఉన్నా.. ఏమైనా.. సహజత్వాన్ని కోల్పోతే.. ఏరంగంలో వారికైనా ప్రమాదమే! అందుకే గతంలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అన్నగారు ఎన్టీఆర్.. పార్టీ పెట్టుకున్నా.. సహజత్వానికి పెద్ద పీట వేసేవారు. తన ఉనికిని ప్రధానంగా ఆయన ప్రస్తావించేవారు. దీంతో పార్టీ పదికాలాల పాటు మనగలిగేలా ఎదిగింది.
ఎవరికైనా సహజత్వమే ప్రధానం. అయితే.. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ సహజత్వాన్ని కోల్పోతోందనే వ్యాఖ్యలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. ప్రశ్నిస్తానంటూ… సొంత కుంపటి పెట్టుకున్న పవన్.. కొన్నాళ్లు ఆ పనిచేసినా.. ఇప్పుడు ప్రశ్నలకే ఆయన ప్రశ్నగా మారిపోయారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
సహజత్వాన్ని కోల్పోనని, తన ముక్కుసూటి తనం ఎవరి ముందు తలవొంచదని.. గతంలో అనేక సంద ర్భాల్లో చెప్పుకొచ్చారు పవన్. ఈ క్రమంలోనే ఏపీలోను, తెలంగాణలోనూ ఆయన యాత్రలు చేశారు. ఇది ప్రజల్లోకి వెళ్తున్న క్రమంలోనే ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకునే స్వేచ్ఛ ఉంది. అయితే, అదేసమయం లో అసలు సహజ స్వరూపాన్ని.. ప్రశ్నించే తత్వాన్ని కూడా కోల్పోయేలా పరిస్థితి మారితే.. ? ఇప్పుడు అదే జనసేనకు పెనుశాపంగా మారి పోయింది.
ప్రస్తుతం పోలవరం, రాజధాని, విశాఖ రైల్ జోన్, ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు నిధులు, జీఎస్టీ పరిహారం.. ఇలా అనేక విషయాల్లో కేంద్రం నుంచి ఏపీకి సహకారం అందాల్సిన అవసరం ఉంది. అయితే, ఆయా విషయాల్లో కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ.. అవకాశం వచ్చినప్పుడు జంప్ చేస్తోంది.వాటి నుంచి తప్పించుకుంటోంది. గతంలో పోలవరం, రాజధాని, విశాఖ రైల్జోన్, హోదా.. ఇలా అన్నింటిపైనా పవన్ తన గళాన్ని వినిపించిన సందర్భాలు ఇప్పటికీ ఏపీ ప్రజల చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. ప్రశ్నిస్తాను.. నిలదీస్తాను.. తాటతీస్తాను.. అన్న డైలాగులు కూడా ఇంకా రింగురింగుమంటూనే ఉన్నాయి.
ఇప్పుడు అవే అంశాలు ఏపీకి శాపంగా మారాయి. కేంద్రం ఇవ్వనంటోందా? లేక ఏపీ ప్రభుత్వ పెద్దలు కేంద్రం ముందు అరెస్టవుతున్నారా? ఫలితంగా ఏపీ ప్రజల ప్రయోజనాలను పాతిపెడుతున్నారా? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ సమయంలో మాట్లాడి.. తన సహజత్వాన్ని నిరూపించాల్సిన పవన్.. మౌనంగా ఉండడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఇలా అయితే.. ఫ్యూచర్ ఉండేనా? అనే ప్రశ్నలు సైతం తెరమీదికి వస్తున్నాయి. ఎంత పొత్తు ఉంటే మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన పార్టీ ఇతర రాష్ట్రాల్లో మనకు కనిపించడం లేదు. ఇటీవలే పంజాబ్‌కు చెందిన శిరోమణి అకాలీదళ్ పార్టీ.. ఏకంగా కేంద్ర మంత్రి పదవిని సైతం వదులుకుని.. రైతులకు వ్యతిరేకంగా ఉన్న బిల్లుల విషయంలో బీజేపీకి ఝలక్ ఇచ్చింది. మరి ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినా.. పొత్తు అనే పేరుతో జనసేనాని మౌనం పాటించడం భావ్యమేనా?! ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న…!!