ఏపీ రాజకీయాలు అన్నీ కూడా ఇప్పుడు జనసేనాని పవన్ చుట్టూ తిరుగుతున్నాయి. ప్రధాన మంత్రి నరేం ద్ర మోడీ విశాఖపట్నానికి వచ్చి వెళ్లినతర్వాత నుంచి పవన్ వ్యవహార శైలిలో మార్పు కనిపించింది. అప్పటి వరకు ఏపీలోని వైసీపీ నేతలపై విరుచుకుపడిన ఆయన ఆ తర్వాత నుంచి పథకాలపై విరుచుకుపడడం ప్రారంభించారు. ఇంతకుముందు వ్యక్తిగత విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
వైసీపీ నేతలకుచెప్పులు చూపిస్తూ తాటతీస్తా అంటూ కామెంట్లు చేసిన పవన్ తర్వాత అనూహ్యంగా తన శైలిని మార్చుకున్నారు. విజయనగరంలో జిల్లాలోని గుంకలాంకువెళ్లిన తర్వాత జగనన్న ఇళ్ల కాలనీలపై విమర్శలు చేశారు. అదేసమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు చేతులు కలుపుతానని, టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి చేసిన ప్రతిజ్ఞను కూడా ఆయన పక్కన పెట్టినట్టుకనిపిస్తోంది. టీడీపీ గురించి కానీ, ఆ పార్టీ నేతల గురించి కానీ పవన్ ఎక్కడా మాట్లాడడం లేదు.
ఇక, విశాఖ ఘటనను కూడా వదిలేసినట్టు కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా చూస్తానని, ఈ క్రమంలో ఇతర పార్టీలను కూడా కలుపుకొని వెళ్లేలా ఒక పక్కా ప్లాన్తోముందుకు సాగుతానని పవన్ గతంలో పార్టీ ఆవిర్భావ సభలో చెప్పారు. అయితే, దీనికి కూడా ఇప్పుడు రాం రాం పలికినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో సింగిల్‌గానే ఆయన పోటీ చేయనున్నట్టు సంకేతాలు ఇచ్చారు.
ఈ క్రమంలోనే ఆయన తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని, అవినీతి పరుల తాట తీస్తానని పరోక్షంగా వైసీపీ నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మరి ఒక్క ఛాన్స్ తనకు ఇవ్వాలంటే టీడీపీతో కలిసి పనిచేసే ఉద్దేశం ఇక, లేనట్టేకదా! అనే చర్చకు ఆయన అవకాశం ఇచ్చారు. అంతేకాదు, తనే అధికారంలోకి వస్తానని ప్రకటించిన పవన్, ప్రస్తుతం అమలవుతున్న అన్ని సంక్షేమ పథకాలను కూడా కొనసాగిస్తానని ప్రకటించారు.
సో, ఇదంతా చూస్తుంటే ఆయనకు బీజేపీ రూట్ మ్యాప్ ఇచ్చేసిందా? ప్రధాని మోడీ ఆయనకు హితబోధ చేశారా? అనే సరికొత్త చర్చ తెరమీదికి వచ్చింది. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా పవన్‌ను టీడీపీతో కలవొద్దని బీజేపీ అధిష్టానం చెప్పినట్టు తాజాగా ప్రకటన చేయడం దీనికి మరింత బలం చేకూరుస్తోంది. మొత్తానికి ఏదైతే పవన్ కోరుకున్నారో.. ఆ రూట్ మ్యాప్‌ను బీజేపీ అందించిందనే సంకేతాలు వస్తున్నాయి.