గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసే విమర్శలను వైసీపీ ఒఖ స్థాయి వరకు స్పందించేంది. పవన్ కూడా ఓ స్థాయివరకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేవారు. అయితే, బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చింది. గతంలో ఒక స్థాయి వరకు వైసీపీపై విమర్శలు గుప్పించే పవన్ కల్యాణ్…ఈ మధ్య కాలంలో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుడుతున్నారు. దేవాలయాలపై దాడుల విషయంలో జగన్ సర్కార్ పై బీజేపీ గరంగరంగా ఉండడంతో పవన్ తన రూటు మార్చారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ పవన్ ఘాటు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. మిత్రపక్షం బీజేపీ కన్నా వెనుకబడిపోయామన్న భావనలో ఉన్న పవన్ విమర్శల విషయంలో గేరు మార్చారు. మొన్నఆలయాల రక్షణపై ప్రభుత్వం తన వైఖరి తెలపాలని గట్టిగా డిమాండ్ చేశారు పవన్. కమీషన్లు వచ్చే కాంట్రాక్ట్ పనులపైనే కాకుండా…ఆలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపైనా ఫోకస్ చేయాలని ప్రభుత్వానికి చురకలంటించారు పవన్. అయితే, ఉన్నట్టుండి పవన్ టాప్ గేర్ లో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడానికి కారణమేమిటన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
దేవాలయాలపై దాడుల విషయంలో ప్రభుత్వ తీరును ఎండగడుతున్న బీజేపీ….మైలేజీ సంపాదించుకుంటోంది. రామతీర్థ యాత్ర చేపట్టిన సోము వీర్రాజు అరెస్టు….ఆ తర్వాత జగన్ పై వీర్రాజు విమర్శలు బీజేపీకి ప్లస్ అయ్యాయి. అయితే, దేవాలయాలపై దాడుల విషయంతోపాటు మరికొన్ని తాజా రాజకీయ పరిణామాలపై తాను వెనుకబడ్డానన్న భావన పవన్ కు కలిగిందన్న టాక్ వస్తోంది. అందుకే, జగన్ ను విమర్శించే విషయంలో పవన్ ఇటీవలి కాలంలో కాస్త దూకుడు పెంచారని తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పిస్తోన్న పవన్ తన రూటు కొద్దిగా మార్చినట్టు కనిపిస్తోంది. గతంలో పవన్ ను లైట్ తీసుకుని పవన్ కోసం తక్కువ టైం కేటాయించేది వైసీపీ. అయితే, పవన్ తాజా దూకుడు ,భిన్నమైన విమర్శల నేపథ్యంలో వైసీపీ నేతలు కూడా పవన్ వ్యాఖ్యలపై ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. తన గురించి ఎక్కువ సమయం వైసీపీ నేతలు మాట్లాడుకునేలా చేయడంలో పవన్ సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు. అంతేకాదు, బీజేపీ తనను డామినేట్ చేస్తున్న భావనను జనంలో తొలగించడానికి కూడా పవన్ విమర్శల గేరు మార్చారని తెలుస్తోంది. జగన్ పై పవన్ దూకుడుకు…కారణమిదేనని చర్చ జరుగుతోంది.