రాజకీయాలలో రెండు పార్టీల మధ్య పొత్తు ఉండటం సర్వసాధారణమైన విషయం. జాతీయ స్థాయి పార్టీలు కావచ్చు లేదా ప్రాంతీయ స్థాయి పార్టీలు కావచ్చు…రాష్ట్రంలోని, దేశంలోని పరిణామాలను బట్టి అధికార పక్షాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పార్టీల మధ్య పొత్తులు ఏర్పడుతుంటాయి. ఆ పొత్తులో రెండు పార్టీల ప్రయోజనాల కు దెబ్బతగలకుండా సమిష్టిగా లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇరు పార్టీలు ప్రయత్నిస్తాయి.
అయితే ఒక పార్టీతో మరొక పార్టీ పొత్తు పెట్టుకున్నంత మాత్రాన ఆ రెండు పార్టీల్లో ఏ పార్టీ బలహీనమైనది కాదు. ఒకవేళ ఆ రెండు పార్టీలలో ఒక పార్టీకి అనుభవం, కేడర్ లేకపోయినప్పటికీ…ఆ పార్టీతో అపార అనుభవం, బలమైన కేడర్ ఉన్న మరొక పార్టీ పొత్తు పెట్టుకునేందుకు ముందుకు వచ్చిందంటే సదరు పార్టీ బలహీనమైనదని కాదు. ఈ చిన్న లాజిక్ ను ఏఫీలోని జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు మిస్ అయినట్లు కనిపిస్తోంది.
టీడీపీ,జనసేనల మధ్య పొత్తు పొడిచే అవకాశాలున్నాయన్న ప్రచారం నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఈ మధ్య బాగా వైరల్ అయింది. పవన్ కళ్యాణ్ ఫోటో ముందు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేతులు చాపి మాకు నువ్వే దిక్కు అంటూ పవన్ ను వేడుకుంటున్నట్టుగా ఉన్న ఫోటోను జనసేన కార్యకర్తలు, అభిమానులు కొందరు విపరీతంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. #NuvveDikku ను కొందరు జనసైనికులు ట్రెండ్ చేస్తున్నారు.
రాష్ట్రంలో వైసీపీని దీటుగా ఎదుర్కొనగలిగే సత్తా ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అన్నది అక్షర సత్యం. ఇటు కేడర్ పరంగా…అటు చంద్రబాబు వంటి అనుభవమున్న లీడర్ రూపంలో పార్టీ బలంగా ఉంది. అయితే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా, 2019 మాదిరిగా వైసీపీకి లాభం జరగకూడదన్న ఉద్దేశంతోనే జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.
కానీ, తన అవసరమే టీడీపీకి ఉంది అనే అర్థం వచ్చేలాగా పవన్ ఇటీవల జరిగిన జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. 2014లో నేను తగ్గాను…2024లో మీరు తగ్గండి అన్న రీతిలో టీడీపీని ఉద్దేశించి పవన్ చేసిన పరోక్ష వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇక, సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ను ప్రకటిస్తేనే టీడీపీకి జనసేన మద్దతు ఇస్తుంది అంటూ కొందరు జనసైనికులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆ పోస్టులకు టీడీపీ అభిమానుల నుంచి ట్రోలింగ్ ఎదురవుతోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒకవేళ చంద్రబాబు జనసేనతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తే దానిని బలహీనతగా భావించకూడదని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి ఇటు టీడీపీకి, అటు జనసేనకు నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి పొత్తుల గురించి టీడీపీ ఆలోచిస్తుందని వారు చెబుతున్నారు.
ఒకవేళ తానే సీఎం అభ్యర్థి అని ప్రకటించాలని పవన్ కోరితే, దానికి చంద్రబాబు ఒప్పుకోకుంటే సొంతగా పోటీ చేసి అధికారంలోకి రాగల సత్తా టీడీపీకి ఉందని, కానీ ఆ పరిస్థితి జనసేనకు లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని టీడీపీ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. ఏదేమైనా ఇటువంటి పోస్టులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసేన నేత నాదెండ్ల భాస్కర్, నాగబాబు వంటి నేతలు ఖండించాలని టీడీపీ కార్యకర్తలు, అభిమానులు కోరుతున్నారు.