సీన్ నెంబరు 1
కోట్లాది మంది ప్రజల మనసుల్లో చోటు సాధించి.. అనూహ్య రీతిలో చోటు చేసుకున్న హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాణాలు కోల్పోయిన వైనం తెలుగు ప్రజలకు ఆశనిపాతంగా మారింది. ఆ చేదు నిజాన్ని తట్టుకోలేక పదుల సంఖ్యలో ప్రాణాలు విడిచారు అరవీర భయంకర వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు. మరణ వార్త మీద స్పష్టత వచ్చినంతనే చాలామంది భోరున ఏడ్చేశారు. చేస్తున్న పనుల్ని ఆపేశారు. ఉద్యోగాలకు సెలవు పెట్టారు. తిండి తినలేదు. కంటి నిండా నిద్ర పోలేదు.
ఇదంతా ఒక వ్యక్తి తమకు శాశ్వితంగా దూరమయ్యారన్న వేదనతో. నేరుగా సంబంధం లేకున్నా.. ముఖపరిచయం లేకున్నా.. దగ్గరకు వెళ్లేంత అవకాశం లేని కోట్లాది మంది అనుభవం. మరి.. అలాంటి మహనీయుడి కొడుకు ఎలా ఉండాలి? ఏం చేస్తుండాలి? తన తండ్రి పార్థిపదేహాన్నిసందర్శించటానికి వచ్చిన వారిని తమ ఇంటి వెనకున్న మరో ఇంట్లో ఉన్న తన తల్లి విజయమ్మను పరామర్శించేందుకు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల దగ్గర.. తమ తదుపరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న కాగితం మీద సంతకం చేయించుకున్నారు.
సీన్ నెంబరు 2
దివంగత మహానేత వైఎస్ సైతం పల్లెత్తు మాట అనటానికి ఇష్టపడని సీనియర్ రాజకీయ నేత కొణిజేటి రోశయ్య. తాను ముఖ్యమంత్రిగా ఉంటే.. ఆర్థిక మంత్రిగా ఆర్థిక పగ్గాలు.. కళ్లాలు ఆయనకు అప్పజెప్పిన వైఎస్ సైతం.. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎవరికైనా ఏదైనా భారీ హామీ ఇవ్వాలంటే వెనుకా ముందు చూసేవారు. రోశయ్య పెద్దరికంతో పాటు.. ఆయన కమిట్ మెంట్ ఎంతన్న విషయం వైఎస్ కు బాగా తెలుసు కాబట్టి. మరి.. అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ అధిష్ఠానం ముఖ్యమంత్రిని చేస్తే.. ఆయనపై తన వర్గీయుల్ని ఎంతలా ఉసిగొల్పింది.. మంత్రి వర్గసమావేశాల్లో ఆయన్ను కించపరిచేలా.. మనసు నొచ్చుకునేలా.. అదే పనిగా ఆయన పెద్దరికం వేదన చెందేలా చేసింది ఎవరు? ఎందుకోసం? తనకు చెందిన సీఎం పదవి.. తనకు కాకుండా మరొకరి చేతుల్లోకి వెళ్లిందనేగా? మరి.. సీఎం పదవిని అంతలా కోరుకోవటమే ఉత్తమమైన మార్గమా?
సీన్ నెంబరు 3
ఒక్క అవకాశం. ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి. నేనేమిటో చూపిస్తా. మీ రాజన్న కొడుకేమిటో చూపిస్తాడు. అంటూ ఏళ్లకు ఏళ్లుగా చెప్పుకొని.. ఊరూర తిరిగి చివరకు ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి.
సీన్ నెంబరు 4
మా నాన్న మరణం వెనుక కుట్ర దాగి ఉంది. పథకం ప్రకారమే చేసి ఉంటారు. దాని వెనుక ఉన్నది ఫలానా అన్న మాటకు జగన్మోహన్ రెడ్డి వర్గీయులు రిలయన్స్ సంస్థల మీద దాడులు చేయటం తెలిసిందే. మరి.. తాను ముఖ్యమంత్రి అయ్యాక అదే ముకేశ్ అంబానికి సన్నిహితుడైన వ్యక్తికి రాజ్యసభ సభ్యత్వాన్ని కట్టబెట్టటం ఎందుకు? టీటీడీ బోర్డులో చోటు కల్పించటం ఎందుకు? ముఖ్యమంత్రి కావాలంటే సెంటిమెంట్ రగిలించాలంటే దేనికైనా సిద్ధం అన్నట్లుగా ఉండాల్సిందేనా?
సీన్ నెంబరు 5
2014లో జరిగిన ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశానికి.. దాని క్రెడిట్ ఎవరికి ఎంతన్న విషయం మీద ప్రజలకే కాదు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు క్లారిటీ ఉంది. మరి.. అలాంటి వేళలో.. ఒక కాంటాక్టు పని కానీ.. తన వారికి నామినేటెడ్ పదవి కానీ.. వీటన్నింటిని పక్కన పెడితే.. తాను అడిగితే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు సైతం చంద్రబాబు సిద్ధంగా ఉన్న వేళలో..తనకేమీ వద్దని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలించండని చెప్పి.. పక్కకు వెళ్లిపోయిన వ్యక్తి పవన్ కల్యాణ్.
ముఖ్యమంత్రి రావాలా? ముఖ్యమంత్రి పదవిని తీసుకోవాలా? ముఖ్యమంత్రి పదవి వరించాలా? ఇలాంటి సందేహాలకు తావిచ్చేలా జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్వశ్చన్లు వేశారు. చాలామందికి పవన్ మాటల్లో అర్థం.. పరామర్థం అర్థం కాలేదు. మరికొందరికి అర్థమైనా.. అర్థమైన విషయాన్ని అర్థమైనట్లు చెబితే.. తమ ప్రయోజనాలకు కలిగే నష్టం తెలుసు కాబట్టి..అందరూ కన్వీన్స్ అయ్యేలా విషం చిమ్మే పనిని జోరుగా షురూ చేశారు పవన్ వ్యతిరేకులు.
ఇక్కడ చాలామంది మిస్ అవుతున్న లాజిక్ ఏమంటే.. పవన్ తనకు ముఖ్యమంత్రి పదవి వద్దని చెప్పటాన్ని చేతకానితనంగా.. తెలివి తక్కువతనం అన్న బ్రాండ్ క్రియేట్ చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వారంతా మిస్ అవుతున్న పాయింట్ ఏమంటే.. జగన్మోహన్ రెడ్డి మాదిరి ‘‘నాకు ముఖ్యమంత్రి పదవి కావాలి.. నేను సీఎం కావాలి’’ అని అదే పనిగా ఆత్రపడితే పవన్ కల్యాణ్ మరో జగన్ అవుతారే కానీ జనసేనాని కాలేరు కదా. పవన్ ను అభిమానించిందుకే ఆయన్ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నప్పుడు.. ఆయనకు ఆయన తాను ముఖ్యమంత్రి అయితే బాగుండదని అనుకోకుండా ఉంటారా?
ఎవరైనా తమను తాము ప్రేమించుకోకుండా ఉండరు కదా? కానీ.. తనను తాను ప్రేమించే కన్నా.. తన తోటి వారిని.. తనను నిస్వార్థంగా అభిమానించి.. ఆరాధించే వారి బాగు కోసం.. ఏపీ రాష్ట్ర భవిష్యత్తుకు బాట వేసే క్రమంలో భాగంగా పదవీ త్యాగానికి సైతం సిద్ధపడటమే పవన్ అంటే. అందుకు భిన్నంగా ఎవరికి ఏమైనా కావొచ్చు. ఏం చేసైనా సరే.. నేను మాత్రం ముఖ్యమంత్రి కావాలని అనుకోవటం పవన్ ఎందుకు చేస్తాడు.అలా చేస్తే..ఆయన మరో జగన్మోహన్ రెడ్డి అవుతారు కదా? ఇప్పటికే ఏపీకి ఒక జగన్మోహన్ రెడ్డి ఉండగా.. మళ్లీ అలాంటి నేత అవసరం ఉందా? ఒకవేళ అలాంటి ధోరణే ఉంటే పవన్ కల్యాణ్ అని అనగలుగుతామా?