జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ అయితే ఏకంగా పవన్ వ్యక్తిగత జీవితంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపింది. పవన్ పెళ్లిళ్ల గురించి ఇటీవల జగన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో, జగన్ తాత రాజారెడ్డి..జగన్ సోదరి షర్మిల పెళ్లిళ్ల గురించి జనసేన నేతలు కొందరు విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే జనసేన నేతలకు పవన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఈ రోజు జనసేన అధికార ప్రతినిధులతో పవన్ భేటీ అయ్యారు. టీడీపీతో పొత్తుతోపాటు ఎన్నికలకు సంబంధించిన పలు కీలక అంశాలపై వారికి పవన్ దిశా నిర్దేశం చేశారు. మీడియా సమావేశాలు, టీవీ చర్చల్లో పాల్గొనే జనసేన ప్రతినిధులు రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండాలని, పాలనాపరమైన, ప్రజలకు ఉపయోగపడే అంశాలపైనే మాట్లాడాలని అన్నారు. రాజ్యాంగానికి లోబడే కుల, మతాల గురించి మాట్లాడాలని సూచించారు. వ్యక్తిగత అభిప్రాయాలకు, దూషణలకు స్థానం లేదని అన్నారు. తన సినిమాలు, తన కుటుంబ సభ్యులపై వచ్చే విమర్శలపై పార్టీ అధికార ప్రతినిధులు స్పందించవద్దని పవన్ ఆదేశించారు. అలా చేయడం వల్ల పార్టీ లక్ష్యం పక్కదారి పట్టే అవకాశముందని పవన్ అన్నారు.
అన్ని మతాలను ఒకేలా గౌరవించాలని, సంబంధింత అంశాలపై లోతుగా అధ్యయనం చేసిన తర్వాతే టీవీ డిబేట్లలోకి వెళ్లాలని సూచించారు. సంస్కారంతో ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాలని, ప్రత్యర్థి పార్టీల నాయకులు రెచ్చగొట్టినా సంయమనం పాటించాలని అన్నారు. సోషల్ మీడియాలో అనవసరమైన ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని, సోషల్ మీడియాలోసమాచారాన్ని నిర్ధారించుకున్నాకే దానిపై మాట్లాడాలని అన్నారు. పార్టీ ప్రతినిధులుగా ఉంటూ సోషల్ మీడియాలో వ్యక్తిగత పోస్టులు పెట్టొద్దని హితవు పలికారు.