అమ్మ ఒడి నిధులు విడుదల కార్యక్రమం సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వరాహి అనే లారీ ఎక్కి, ఆవేశంతో పవన్ ఊగిపోతుంటాడని జగన్ ఎద్దేవా చేశారు. మాట్లాడితే చెప్పుతో కొడతా, గుడ్డలూడదీసి కొడతా అని బూతులు మాట్లాడుతుంటాడని విమర్శించారు. నాలుగు పెళ్లిళ్లకు, నాలుగేళ్లకోసారి భార్యను మార్చడానికి పేటెంట్ హక్కులు పవన్ కే ఉన్నాయని ఎద్దేవా చేశారు.
ఈ క్రమంలోనే జగన్ వ్యాఖ్యలపై పవన్ కూడా చమత్కార ధోరణిలో స్పందించారు. సరిగ్గా అ, ఆ లు నేర్చుకోకపోతే వరాహికి, వారాహికి తేడా తెలియదని జగన్ కు చురకలంటించారు. జనసేన వయోజన సంచార పాఠశాల పథకం కింద తానే జగన్ కు స్వయంగా అక్షరాలు, ఒత్తులు నేర్పిస్తానని సెటైర్ వేశారు.
“ఒక నియంత, కంటకుడు, తెలుగు ఉచ్చారణ రాని జగన్ వంటి వ్యక్తి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం బాధాకరం. దీనికి అందరం బాధపడుతున్నాం” అని పవన్ అన్నారు. తాను చెప్పు చూపించడానికి ముందు చాలా జరిగిందని చెప్పారు. తాను ఊగిపోతా మాట్లాడుతున్నానని జగన్ బాధపడిపోతున్నారని, రేపటి నుంచి ఇలా… ఇలా… ఇలా మాట్లాడతాను… అది ఓకేనా! అంటూ జగన్ ప్రసంగించే శైలిని పవన్ అనుకరించి కౌంటర్ ఇచ్చారు.
రేపటి నుంచి కొత్త పద్ధతిలో మాట్లాడుతానని, ఇది ముఖ్యమంత్రి గారికి ఓకేనో కాదో కనుక్కుందాం అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పవన్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రేపు నుండి ఇలా.ఇలా..ఇలా… మాట్లాడుతాను.#HelloAP_ByeByeYCP #VarahiVijayaYatra pic.twitter.com/0afpWBdXWw
— JanaSena Party (@JanaSenaParty) June 28, 2023