జనసేన అధ్యక్షుడు, పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన సమర్పించిన అఫిడవిట్లో గత ఐదేళ్ల ఆదాయం, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలు తెలిపారు. దీనికి సంబంధించి పార్టీ పరంగా కూడా ఆయన ప్రకటన విడుదల చేశారు. గత అయిదేళ్లలో పవన్ కళ్యాణ్ సంపాదన రూ.114.76 కోట్లుగా ఉంది. ఆదాయ పన్ను రూపంలో ప్రభుత్వానికి కట్టింది.. రూ.47.07 కోట్లు. జీఎస్టీ రూపంలో చెల్లించింది. రూ.26.84 కోట్లు. అయితే.. ఏపీసీఎం జగన్ పాలనపై విరుచుకుపడే పవన్.. ఆయన ప్రభుత్వానికి .. రూ.50 లక్షలు విరాళంగా అందించారు. ఇది ముఖ్య మంత్రి సహాయనిధికి చేరింది.
అప్పులు
పవన్ కళ్యాణ్ అప్పులు రూ.64.26 కోట్లుగా పేర్కొన్నారు. దీనిలో వివిధ బ్యాంకుల నుంచి రూ.17.56 కోట్లు అప్పు తీసుకోగా, ఇతర ప్రైవేటు వ్యక్తుల నుంచి తీసుకున్న అప్పు రూ.46.7 కోట్లు.
విరాళాలు ఇచ్చినవి
పవన్ కళ్యాణ్ వివిధ సంస్థలకు, జనసేన పార్టీ చేపట్టే సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల నిమిత్తం విరాళాలు అందించారు. ఇందులో జనసేనకు రూ.17.15 కోట్లు, కౌలు రైతు భరోసా, క్రియాశీలక కార్యకర్తలకి ప్రమాద బీమా లాంటి కార్యక్రమాలకు రూ.3 కోట్ల మేరకు విరాళాలు ఇచ్చారు. వివిధ సంస్థలకు రూ.3.32 కోట్లు విరాళాలు ఇచ్చారు.
విరాళాల లెక్క ఇదీ!
సైనిక్ బోర్డు – రూ.కోటి
పి.ఎం. సిటిజెన్ ఆసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఫండ్ : రూ.కోటి
ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి: రూ.50 లక్షలు
తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి: రూ.50 లక్షలు
శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్: రూ.30 లక్షలు
పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్స్ లెన్స్ సంస్థకు: రూ.2 లక్షలు