వైసీపీ హయాంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటే వ్యాపార, పారిశ్రామికవేత్తలు భయపడేవారు. జగన్ హయాంలో ఏపీకి కొత్త ఇండస్ట్రీల సంగతి దేవుడెరుగు…ఉన్న ఇండస్ట్రీలు కూడా పొరుగు రాష్ట్రాలకు తరలిపోయిన పరిస్థితి చూశాం. అయితే, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారాయి. సీఎం చంద్రబాబు అనుభవం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తపన చూసి ఏపీలో పరిశ్రమలు పెట్టుబడులు పెడుతున్నాయి.
ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాలోని గ్రీన్ కో ప్రాజెక్టును పవన్ కల్యాణ్ సందర్శించిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 45 హెక్టార్ల భూమి వివాదంలో ఉందని, రెవెన్యూ, అటవీ శాఖల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకే తాను వచ్చానని పవన్ చెప్పారు. ఐటీ రంగం తర్వాత గ్రీన్ ఎనర్జీ మీద చంద్రబాబు ఫోకస్ చేస్తున్నారని, వ్యవసాయానికి పనికిరాని భూముల్లో ఇటువంటి అద్భుతమైన ప్రాజెక్టు చేపడుతున్నామని చెప్పారు.
గాలి, నీరు, సౌర కాంతితో విద్యుత్ తయారు చేయడంలో ప్రపంచంలోనే ఇది మొదటి అతిపెద్ద ప్రాజెక్ట్ అని అన్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకూ రూ.12 వేల కోట్లు ఖర్చు చేశామని, ఇంకా రూ.10 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని చెప్పారు. ఏపీలో మూడో వంతు విద్యుత్ అవసరాలను ఈ ప్రాజెక్టు తీర్చగలదన్నారు. ప్రాజెక్టు విషయంలో ఏ వివాదం ఉన్నా.. కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.