ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి తెరలేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేనానిపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వాలంటీర్లకు పవన్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఓ పక్క పవన్ చేసిన వ్యాఖ్యలపై ఇంత రాద్ధాంతం జరుగుతున్నా ఆయన మాత్రం తగ్గేదేలే అన్న రీతిలో ప్రభుత్వంపై తాజాగా మరోసారి విమర్శలు గుప్పించారు. ఏలూరులో జనవాణి కార్యక్రమం నిర్వహించిన ప్రభుత్వ కళాశాల విద్యార్థుల నుంచి వినతిపత్రాన్ని స్వీకరించిన పవన్…ఏపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు.
చెట్ల కింద చదువులు చూడాలంటే పల్లెటూళ్లకు వెళ్లనవసరం లేదని, ఏలూరు నగరంలోనే చూడొచ్చని షాకింగ్ కామెంట్స్ చేశారు. జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో ప్రభుత్వ కాలేజీకి వెళ్తే చెట్ల కింద చదువుకుంటున్న విద్యార్థులను చూడొచ్చని చురకలంటించారు. పథకాలకు పేర్లు పెట్టుకోవడంపై జగన్ కు ఉన్న శ్రద్ధ కళాశాలలకు భవనాలు కేటాయించడంపై లేదని ఎద్దేవా చేశారు. 300 మంది విద్యార్థులు చదువుకుంటున్న ఈ కాలేజీకి బటన్ నొక్కి బిల్డింగ్ కట్టించు జగన్ అంటూ పవన్ అన్నారు.
కాగా, ఏపీలో నాడు-నేడు పేరుతో జగన్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల రూపురేఖలు మారుస్తున్నామని గొప్పలు చెబుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలలో మాలిక సదుపాయాలు, పక్కా భవనాల నిర్మాణాలు వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం చాలాచోట్ల అధ్వానంగా ఉందని, కొన్ని చోట్ల మాత్రమే స్కూళ్లు, కళాశాలలకు మౌలిక సదుపాయాలు, వసతులు కల్పించారని టాక్ ఉంది.
కాగా, ఏలూరులో జనసేన నాయకులు, వీర మహిళలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే ఉభయగోదావరి జిల్లాలలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై వారితో పవన్ చర్చించారు. ఏలూరులో జనవాణి సందర్భంగా కూడా పలువురు తమ సమస్యలను పవన్ కు మొరపెట్టుకున్నారు. వారి సమస్యలపై సానుకూలంగా స్పందించిన పవన్ వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేసే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.