జనసేన అభిమానుల్లో కొత్త ఉత్సాహం పొంగిపొర్లుతోంది. పార్టీ ఆవిర్భావ సభ కోసం వారెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికలకు ముందు ఏడాది జరుగుతున్న ఈ ఆవిర్భావ సభ.. అధికారపక్షం గా మారటానికి ముందు జరుగుతున్న సభగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఈ సభకు చారిత్రక ప్రాధాన్యత ఉంటుందని.. ఏపీ రాజకీయాల్లో ఈ సభ కీలకంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్ మాట్లాంది లేదు.
ఆ లోటు కాస్తా ఆవిర్భావ సభతో తీరిపోతుందని చెబుతున్నారు. ఈ నెల 14న (మరో 8 రోజుల్లో) జరిగే ఈ సభ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సభలోనే టీడీపీతో పొత్తు లెక్క తేలిపోవటంతో పాటు.. అధికార పార్టీ మీద ఎలాంటి యుద్ధం చేయనున్న విషయంపైనా క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన రోడ్ మ్యాప్ మీద పవన్ క్లారిటీ ఇస్తారని భావిస్తున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. మార్చి 14న జరిగే ఆవిర్భావ సభకు రెండు రోజుల ముందే అమరావతికి చేరనున్న జనసేనాని.. ఆ రెండు రోజులు వివిధ వర్గాలతో భారీ ఎత్తున సమావేశాల్ని నిర్వహించటం.. కీలక అంశాల మీద కసరత్తు చేయనున్నట్లుగా చెబుతున్నారు. ఎన్నికలకు ఏడాదే సమయం ఉన్న వేళలో.. రానున్న రోజుల్లో తన రోడ్ మ్యాప్ ను కూడా ప్రకటించే వీలుందన్న మాట వినిపిస్తోంది. సభకు ముందు కాపు సంక్షేమ సంఘాల నేతలతో సమావేశం కావటంతో పాటు.. కాపు రిజర్వేషన్ పై వారి నుంచి సలహాలు.. సూచనలు తీసుకుంటారని చెబుతున్నారు.
దీనికి తోడు పార్టీకి చెందిన కీలక నేతలతో ఆయన సమావేశాన్నినిర్వహిస్తారని చెబుతున్నారు. ఈ సమావేశంలోనే రానున్న రోజుల్లో జనసేనాని చేయబోయే పర్యటనలకు సంబంధించిన స్పష్టత వస్తుందంటున్నారు. వారాహితో పవన్ చేసే రాష్ట్ర పర్యటనకు జనసైనికులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించిన కీలక ప్రకటన ఖాయమంటున్నారు. మొత్తంగా చూస్తే ఆవిర్భావ సభకు రెండు రోజుల ముందే అమరావతికి రానున్న పవన్.. తనను అభిమానించి.. ఆరాధించే వారంతా ఎదురుచూస్తున్న పలు అంశాల మీద స్పందించటం ఖాయమంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.