మార్చి 16న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఏపీతోపాటు మరో మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు గాను షెడ్యూల్ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించనుంది. ఈ క్రమంలోనే ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే నా కల అంటూ సీఎం జగన్ ఓ వీడియోను విడుదల చేయగా తాము కూడా తక్కువ కాదంటూ జనసేన ఓ ఆసక్తికర వీడియోను విడుదల చేసింది.
ముఖ్యమంత్రి కార్యాలయాన్ని పోలి ఉండే ఒక గదిలో టేబుల్ పై పేపర్లు ఫ్యాన్ వేయగానే గాలికి చెల్లాచెదురుగా పడిపోతాయి. అయితే అవి చూసిన పవన్ కళ్యాణ్ వెంటనే ఆ గదిలోకి అడుగుపెట్టి సినిమాలో పవర్ స్టార్ మాదిరిగా ఆ గదిలోకి ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్ ఆపేస్తారు. ఏపీ అభివృద్ధి, అమరావతి రాజధాని ఇలా చిందరవందరగా గది మొత్తం నిండిపోయి కింద పడి ఉన్న పేపర్లను ఒక్కొక్కటిగా ఏరి ఒక క్రమంలో బల్లపై పవన్ కళ్యాణ్ పెడతారు. ఆ పేపర్లు ఎగిరిపోకుండా దానిపై పేపర్ వెయిట్ లాగా గాజు గ్లాసును పవన్ కళ్యాణ్ ఉంచుతారు.
ఆ గ్లాస్ గుర్తు పక్కనే కమలం గుర్తు, సైకిల్ గుర్తు కలిసి ఉన్న ఒక మెమెంటో కనిపిస్తుంది. ఇక, ఆ కుర్చీ పైన పవన్ కళ్యాణ్ చేయి వేసి ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నట్లుగా కనిపిస్తుంటారు. పవన్ ముఖ్యమంత్రి పీఠాన్ని కోరుకుంటున్నారు అని చెప్పకనే చెబుతున్నట్లుగా ఈ వీడియోను రూపొందించారని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ మొత్తం వీడియోలో కనిపిస్తున్నది పవన్ కళ్యాణ్ అని అర్థం అవుతున్నప్పటికీ ఎక్కడా పవన్ కళ్యాణ్ ముఖం కనిపించదు. ‘పొత్తు గెలవాలి ప్రభుత్వం రావాలి’ అనే థీమ్ తో ఈ వీడియోను రూపొందించారు.
ఫ్యాన్ గాలికి కొట్టుకుపోతున్న రాష్ట్ర భవిష్యత్తును తిరిగి గాడిలో పెట్టే బాధ్యతను చేపట్టిన గాజు గ్లాసు అంటూ జనసేన తన ఎక్స్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసింది. జగన్ పాలనకు చరమగీతం పాడేందుకు సిద్ధమవుతున్న పవన్ పొలిటికల్ యాడ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.