టీడీపీ అధికార ప్రతినిధిగా పట్టాభి కొంతకాలంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అధికార పార్టీ వైసీపీ వైఫల్యాలను, సీఎం జగన్ పాలనలోని లోపాలను ఎత్తిచూపడంలోనూ పట్టాభి ముందు వరుసలో ఉంటున్నారు. జగన్ తో పాటు వైసీపీ నేతలపై పదునైన విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్ది నెలల క్రితం పట్టాభి ఇంటిపై, టీడీపీ కేంద్ర కార్యాలయంపై కూడా వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడిన ఘటన సంచలనం రేపింది.
ఆ తర్వాత తాజాగా వల్లభనేని వంశీ వ్యవహారం నేపథ్యంలో పట్టాభిని పోలీసులు అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులతోపాటు హత్యాయత్నం కేసును నమోదు చేశారు. అయితే, పట్టాభిని వైసీపీ నేతలు ఇంతలా టార్గెట్ చేయడానికి బలమైన కారణాలున్నాయని ప్రచారం జరుగుతోంది. గన్నవరంలో వల్లభనేని వంశీని ఎదుర్కొనే బలమైన నేత కోసం ఎదురుచూస్తున్న సమయంలో పట్టాభిపై టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టి మళ్లిందని టాక్ వచ్చింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్ సర్కారుపై పట్టాభి మరోసారి నిప్పులు చెరిగారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులపై వైసీపీ ప్రభుత్వం కక్ష గట్టిందని ఆరోపించారు. ఓవైపు ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రులు కమిటీ చర్చలు జరుపుతోందని, అదే సమయంలో ఉద్యోగుల ఇళ్లకు పోలీసులను పంపి బెదిరింపులకు పాల్పడుతోందని సంచలన ఆరోపణలు చేశారు. గత చర్చల్లోనూ సీపీఎస్ రద్దుపై ఎటువంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదని, నిన్న జరిగిన చర్చలలో కూడా అదే సీన్ రిపీట్ అయిందని పట్టాభి విమర్శించారు.
జీపీఎస్ నే అమలు చేయబోతున్నట్టుగా ప్రభుత్వం తెలిపిందని ఆరోపించారు. మరోసారి పిఆర్సి కమిటీ పేరుతో కాలయాపన చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని అన్నారు. ఉద్యోగులను జగన్ మరోసారి మోసం చేస్తున్నారని పట్టాభి ఆరోపించారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో చెల్లిస్తామనడం ఏమిటని పట్టాభి నిలదీశారు. 7000 కోట్ల రూపాయలకు గాను 175 కోట్లు మాత్రమే చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పడం ఏమిటని మండిపడ్డారు.
మరో ఏడాది తర్వాత ఈ ప్రభుత్వం ఉండదని, ప్రజలు ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తారని పట్టాభి జోస్యం చెప్పారు. మిగతా బకాయి మొత్తం రాబోయే ప్రభుత్వం నెత్తిన పడాలన్న ఉద్దేశంతోనే జగన్ చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు.