తాజాగా ఏపీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై విమర్శలు ఎదురవుతున్నాయి. ఇదేం న్యాయం సర్! అంటూ మేధావులు సైతం ప్రశ్నిస్తున్నారు. రాజ్యంగం ప్రకారం నడుచుకోవాల్సి వస్తే.. అందరినీ ఒకేలా చూడాలని.. లేకపోతే.. అందరినీ వదిలేయాలని వారు చెబుతున్నారు. దీంతో ఏపీలో ఏం జరిగిందనే విషయం ఆసక్తిగా మారింది. ఏపీలో వైసీపీ తరఫున విజయం దక్కించుకున్న ఎమ్మెల్యేల్లో కొందరు టీడీపీకి అనుకూలంగా మారిన విషయం తెలిసిందే.
అదేవిధంగా టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేలు కొందరు వైసీపీకి ఫేవర్ అయిపోయిన విషయం తెలిసిందే. ఇక, ఇటు వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యే తన పదవికి ఒకరు రాజీనామా చేశారు. అటు టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేల్లో ఒకరు రాజీనామా చేశారు. అయితే.. వీరి విషయంలో ఇటు ప్రభుత్వం.. అటు అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశం అయింది. ఇదే ఇప్పుడు మేధావులు సైతం ప్రశ్నించేలా పరిస్థితిని మార్చేసింది.
వైసీపీ తరఫున గెలిచిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్నారెడ్డి.. పార్టీ తనకు టికెట్ ఇవ్వననడంతో పార్టీకి , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈయన రాజీనామాను స్పీకర్ ఆమోదించలేదు. ఇదేసమ యంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు ఉక్కు ఉద్యోగుల పోరాటానికి సంఘీభావంగా 2022లో చేసిన రాజీనామాను తాజాగా స్పీకర్ ఆమోదించారు. అటు వైసీపీ ఎమ్మెల్యే చేసిన రాజీనామాను ఆమోదించకుండా.. ఇటు టీడీపీ ఎమ్మెల్యే చేసిన రాజీనామాను ఆమోదించడంపై మేధావులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, శ్రీధర్‌రెడ్డిలు ఆ పార్టీతో విభేదించారు. దీంతో పార్టీ వారిపై సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో వారు టీడీపీకి అనుకూలంగా మారారు. అయితే.. వీరిని అనర్హులుగా ప్రకటించాలంటూ.. వైసీపీ స్పీకర్ తమ్మినేనికి విన్నవించింది. దీంతో వెంటనే ఆయన రంగంలోకి దిగిపోయి.. సదరు నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు. ఈ నెల 26లోగా సమాధానం చెప్పాలన్నారు. లేకపోతే.. చర్యలు తప్పవన్నారు.
అయితే.. మరోవైపు టీడీపీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు.. వాసుపల్లి గణేష్, మద్దాలి గిరిధర్, వల్లభనేని వంశీ, కరణం బలరాంలు.. వైసీపీలో చేరారు. వీరిపై కూడా చర్యలు తీసుకుని అనర్హత వేటు వేయాలని టీడీపీ కోరింది. కానీ, స్పీకర్ వీరి విషయాన్ని పక్కన పెట్టేశారు. దీంతో ఇదేం న్యాయం సర్.. టీడీపీ అయితే ఒకలా.. వైసీపీ అయితే మరోలా స్పందిస్తారా? అంటూ మేధావులు ప్రశ్నలు సంధిస్తున్నారు.