స్థానిక ఎన్నికల వేడి షురూ అయ్యింది. అన్ని పార్టీలు రంగంలోకి దిగాయి. టీడీపీ మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు విడుదల చేశారు. పల్లె ప్రగతి-పంచ సూత్రాలు అంటూ మేనిఫెస్టోను రూపొందించారు.
తెలుగుదేశం మద్దతుదారులు గెలిస్తే స్వచ్ఛత-పరిశుభ్రతతో ఆదర్శ గ్రామాలను తీర్చిదిద్దుతామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ముఖ్యంగా వ్యవసాయానికి ఉరితాడు వంటి మీటర్లు వ్యవసాయ మోటార్లకు పెట్టకుండా అడ్డుకుంటామని చంద్రబాబు తెలిపారు. ఆస్తి పన్ను తగ్గిస్తామన్నారు. గ్రామాల్లో ప్రజలకు సుపరిపాలన అందిస్తామన్నారు.
ఇక వైసీపీ బలవంతపు ఏకీగ్రీవాలపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ప్రజల ఆమోదం లేని ఏకగ్రీవాలను ఉపేక్షించేది లేదన్నారు. కరోనా ముందు 2,274 ఏకగ్రీవాలు చేశారు. ఏం అభివృద్ధి చేశారని ఏకగ్రీవాలు అవుతాయి. మీరు ప్రజలను ఎన్నికరకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసిస్తున్నారు అని ఆరోపించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగిందా? ఒక రోడ్డు అయినా వేశారా? తెలుగుదేశం ప్రభుత్వం 25 వేల కిలోమీటర్ల రోడ్లు వేసింది. వైసీపీ ఎన్ని కిలోమీటర్ల రోడ్లు వేసింది? ఏం అభివృద్ధి చేశారని ఏకగ్రీవాలు కావాలి మీకు? వైసీపీ చెబుతోన్న ఏకగ్రీవాలు ప్రజల ఆమోదంతో జరిగేవి కాదు. దౌర్జన్యాలు, దాడులతో భయపెట్టి బలవంతపు ఏకగ్రీవాలు చేస్తున్నారు’ అని చంద్రబాబు ఆరోపించారు.
‘ప్రజల ఆమోదం లేని ఈ తరహా ఏకగ్రీవాలు వద్దు. వాటిని ఆమోదించొచ్చు. ప్రతి ఒక్కరు తమ గ్రామాన్ని కాపాడుకోవాలి. ఎవరికీ భయపడొద్దు. గ్రామాల్లో ఏదైనా అన్యాయం జరిగితే బయటకు రాకుండా చేయడానికే ఏకగ్రీవాలు జరుగుతున్నాయి. ఇటువంటి ప్రయత్నాలను అడ్డుకోవాలి. పులివెందులలో ఓ మహిళను చంపారు. కనీసం వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శకు అనుమతి ఇవ్వలేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా మరిన్ని చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారా?’ అని చంద్రబాబు ప్రజలకు వివరించారు..