ఏక‌గ్రీవాల‌పై నిమ్మగడ్డ డేగ కన్ను !!

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే షెడ్యూల్ వ‌చ్చింది. నాలుగు రోజుల కింద‌టే నోటిఫికేష‌న్ కూడా వ‌చ్చినా.. సుప్రీం కోర్టు తీర్పు నేప‌థ్యంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు జ‌ర‌గ‌క‌పోవ‌డంతో రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌.. షెడ్యూల్‌ను పొడిగించి.. రీషెడ్యూల్ చేశారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. ఇక‌, శ‌నివారం మ‌రోసారి నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు. దీనిని బ‌ట్టి.. ఫిబ్ర‌వ‌రి 7న తొలిద‌శ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.
అయితే.. స‌హ‌జంగానే గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఏక‌గ్రీవాలు జ‌రుగుతాయి. ఆయా గ్రామాల‌కు చెందిన ప్ర‌జ‌లు.. త‌మ‌కు న‌చ్చిన నాయ‌కుడిని యునానిమ‌స్‌గా స‌ర్పంచ్‌గా ఎన్నుకునే ఆన‌వాయితీ ఉంది. దీనిని ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ కూడా ఒప్పుకొన్నారు. ఇది సంప్ర‌దాయ‌మేన‌ని వెల్ల‌డించారు.

ఈ మేర‌కు తాజాగా నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ పంచాయ‌తీ ఎన్నిక‌ల ఏక‌గ్రీవాల‌పై మాట్లాడారు. ``గ‌తంలోనూ ఏక‌గ్రీవాలు జ‌రిగాయి. ఇప్పుడు జ‌రుగుతున్నాయి. ఇక‌ముందుకు కూడా ఏక‌గ్రీవాలు జ‌రుగుతాయి. అయితే.. కేవ‌లం ఏక‌గ్రీవాలే జ‌ర‌గాల‌న్న కాన్సెప్టు మాత్రం మంచిదికాదు. దీనిని తీవ్రంగా ప‌రిగ‌ణిస్తాం`` అని ఆయ‌న ప్ర‌భుత్వ పెద్ద‌ల ను ఉద్దేశించి హెచ్చ‌రించారు.

దీనికి ఒక కార‌ణం ఉంది. పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు స‌హ‌క‌రించేది లేద‌న్న స‌ర్కారు.. సుప్రీం తీర్పుతో దిగివ‌చ్చిన నేప‌థ్యంలో ఎన్నిక‌ల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నం చేసింది. ఈ క్ర‌మంలోనే తాజాగా అన్ని మీడియా సంస్థ‌ల‌కు భారీ ఎత్తున ప్ర‌క‌ట‌నలు గుప్పించింది. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ‌ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఏకగ్రీవాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లో సుహృద్భావ వాతావరణం ఏర్పాటు చేసేందుకే ప్రోత్సాహకం ప్రకటిస్తున్నట్లు  పేర్కొంది.

గతేడాదే ఏకగ్రీవాలకు ప్రభుత్వం నజరానా ప్రకటించగా.. తాజాగా 2వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.5లక్షల ప్రోత్సాహకం అందిస్తామని వెల్లడించింది. 2వేల నుంచి 5వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.10లక్షలు, 5వేల నుంచి 10వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపింది. అలాగే 10వేలకు పైన జనాభా ఉన్న పంచాయతీలకు రూ.20లక్షల ప్రోత్సాహకం అందించనున్నట్లు పేర్కొంది.

అయితే.. ఈ నిర్ణ‌యంపై తీవ్ర‌స్థాయిలో మ‌ళ్లీ విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించ‌క‌ముందు.. ఇలా ఉత్త‌ర్వులు జారీ చేయాల్సి ఉంద‌ని.. కానీ, ప్ర‌భుత్వం మాత్రం ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించిన త‌ర్వాతే.. ఈ ఉత్త‌ర్వులు ప్ర‌క‌టించింద‌ని పేర్కొంటూ.. సీపీఐ, సీపీఎం, టీడీపీ, జ‌న‌సేన బీజేపీలు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌కు ఫిర్యాదుల చేశాయి. దీంతో ఆయా అంశాల‌పై దృష్టి పెట్టిన క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ‌.. ప్ర‌భుత్వ వైఖ‌రిని ప‌రోక్షంగా ఎండ‌గ‌ట్టారు. ఈ ప్ర‌క‌ట‌న‌లు, జీవోల‌పై.. చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని.. ఇప్ప‌టికే మీడియాకు భారీ ఎత్తున ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చిన వారిని గుర్తించి(ప్ర‌సార‌, పౌర‌సంబంధాల శాఖ‌) షోకాజ్ నోటీసులు జారీ చేశామ‌న్నారు.

అంతేకాదు.. ఇక‌పై ఎన్నిక‌లను ప్ర‌త్య‌క్షంగా ప‌రోక్షంగా ప్ర‌భావితం చేసే ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నా.. క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌నిహెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. అన్నీ ఏక‌గ్రీవాలు అయినా.. వాటిని ర‌ద్దు చేస్తామ‌ని, అస‌లు ఏం జ‌రిగిందో ప‌రిశీలించి చ‌ర్య‌లు కూడా తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.