అధికారంలో ఉన్నా లేకున్నా అదే పనిగా అధినాయకత్వాన్ని పొగిడే సంస్కృతి అంత మంచిది కాదు. ఒన్ మ్యాన్ షో చేసినంత మాత్రాన అన్నివేళలా ఫలితాలు రావు. ఎంత పెద్ద నాయకుడికి అయినా కార్యకర్తలే ముఖ్యం. వాళ్లే అవసరం కూడా ! వీలున్నంత వరకూ కార్యకర్తలను సమన్వయం చేసుకునే పనిచేయాలి. కానీ వైసీపీలో కార్యకర్తలు, నాయకులు వేర్వేరుగా ఉంటున్నారు.
వలంటీర్లు అధికారులపై అజమాయిషీ చేస్తున్నారు అన్నది ఇప్పుడు వినిపిస్తున్న మాట. ఇదే సందర్భంలో నిన్నటి ప్లీనరీ ముగింపులో మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి మాట్లాడారు. యథావిధిగానే ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ఇంతకూ ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న కురుపాం నియోజకవర్గ పరిస్థితి ఏంటి ?
కొన్ని పరిణామాల రీత్యా సామాజిక సమీకరణాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పదవి పీడిక రాజన్నదొరను వరించింది. అదే సామాజికవర్గంకు చెందిన ఆయనకు ఆ వరం దక్కింది. వాస్తవానికి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయిన పాముల పుష్ప శ్రీవాణి నియోజకవర్గ అభివృద్ధిపై ఎప్పటికప్పుడు బహిరంగ సవాలుకు సిద్ధమేనని అంటుంటారు.
కానీ ఆమె అక్కడ చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నది సొంత ఇంటి మనుషులే ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఆమెపై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవి ఎలా ఉన్నా కూడా ఆమె కాదు అక్కడ ఆమె భర్త పరిక్షత్ రాజు అంతా తానై నడిపిస్తారు అన్న వాదన కూడా ఉంది.
మొదటి సారి ఎన్నికైనప్పుడు ఆమె ప్రజల్లో బాగానే ఉన్నారు. వారి గోడు వింటూ సోషల్ మీడియాలో కూడా వాటి వివరాలు పొందుపరిచేవారు. డిప్యూటీ సీఎం అయ్యాక ఆమె నియోజకవర్గాన్ని పట్టించుకోవడం మానుకున్నారు అన్న వాదన కూడా వినిపించింది. ఆ తరువాత పదవి పోయాక పూర్తిగా తన ఇంటికే పరిమితం అయ్యారు అన్న విమర్శ కూడా ఉంది. దీంతో క్రియాశీలక కార్యకర్తలు ఆమెకు దూరం అయ్యారు. ఇంటి పోరు నేపథ్యంలో ఆమె ఇప్పుడు అనేక సవాళ్లు చవి చూస్తున్నారు.