ఈ సోషల్ మీడియా జమానాలో కొద్దిగ వెరైటీ కంటెంట్..లేదంటే కొంత కాంట్రవర్సీ…మరీ కాదంటే కొద్దిగా వినోదం ఉన్న ఏ పోస్ట్ అయినా సరే క్షణాల్లో వైరల్ అవుతోంది. అసలు సదరు పోస్టులో నిజానిజాలేంటి? ఆ పోస్టు పెట్టిన వారి క్రెడిబులిటీ ఏంటి అన్న కనీస విచారణ లేకుండానే ఆ పోస్టులను ఫార్వార్డ్ చేయడం, వైరల్ చేయడం ఫ్యాషనైపోయింది. ఇక, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండేందుకు కొందరు ఆకతాయిలు అడ్డగోలు పోస్టులు పెడుతూ పాపులర్ అవుదామని ప్రయత్నిస్తూ…అందులో కొంతవరకు సక్సెస్ కూడా అవుతున్నారు.
కొంతమంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు….కొద్దిగా అనారోగ్యానికి గురైతే చాలు….#RIP అంటూ వారు చావకముందే సోషల్ మీడియాలో సమాధి కట్టేస్తున్నారు. మేము బ్రతికే ఉన్నాం మహా ప్రభో అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో చంపేసిన వ్యక్తి మీడియా ముందుకు వచ్చి మరీ వివరణ ిఇస్తేగానీ అసలు విషయం మామూలు జనాలకు కూడా బోధపడడం లేదు. ఇక, ఇలాంటి #RIP మెసేజులు నిజమనుకొని కొందరు సెలబ్రిటీలు కూడా బొక్కబోర్లాపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇదే కోవలో తాజాగా పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఆసుపత్రిలో బెడ్ పై నుంచి ప్రజలకు ఇమ్రాన్ తన చివరి సందేశమిచ్చారంటూ ఓ వీడియో, కొన్ని ఫొటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక, ట్విట్టర్ లోనైతే #RIPImranKhan అనే హ్యాష్ ట్యాగ్ టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఇమ్రాన్ ఖాన్ ఆత్మకు శాంతి చేకూరాలంటూ నెటిజన్లు, కొందరు సెలబ్రటీలు కూడా ట్వీట్లు కూడా చేస్తున్నారు.
కరాచీలో జరిగిన బాంబుదాడిలో ఇమ్రాన్ గాయపడి చికిత్స పొందుతూ మరణించారని సోషల్ మీడియా మేధావులు డిక్లేర్ చేశారు. చివరకు ఈ వార్త ఫేక్ అని తేలడంతో అంతా నాలుక కరుచుకున్నారు. గతంలో ఎప్పుడో అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఆసుపత్రిలో చేరినప్పటి ఫోటోలు, వీడియోలను ఇప్పుడు కొందరు వైరల్ చేశారు. ఇమ్రాన్ మరణ వార్త నిజం కాదని తేలడంతో అలజడి సద్దుమణిగింది. అయితే, గతంలోనూ ఇమ్రాన్ ఖాన్ చనిపోయినట్లు ఇదే తరహాలో ఫేక్ న్యూస్ వైరల్ కావడం విశేషం.