మన దాయాదిదేశం పాకిస్థాన్ పై తరచుగా కేంద్రంలోని పెద్దలు.. ప్రతిపక్ష నాయకులు విమర్శలు సంధి స్తూనే ఉంటారు. ఇరు దేశాల మధ్య ఏవో చికాకులు ఉండనే ఉన్నాయి. సరిహద్దు వివాదాలు.. ఇతరత్రా మాట ల తూటాలు.. ఇలా అనేకం ఉన్నాయి. అయితే.. రాష్ట్రాలకు సంబంధించి ఎవరూ కూడా పాకిస్థాన్‌పై నోరు చేసుకున్న పరిస్థితి లేదు. అందునా.. ఒక సన్యాసిగా ఉన్న వ్యక్తి.. అసలు ఇలాంటిమాటలు అనే సాహసం కూడా చేయరు.
కానీ.. ఎవరైనా చేయరేమో కానీ..యూపీ సీఎంగా ఉన్న సన్యాసి.. యోగి ఆదిత్యనాథ్ మాత్రం అదే సాహసం చేశారు. ప్రపంచ పటంలో పాకిస్థాన్ ఉండదు! అని వ్యాఖ్యానించారు. అది కూడా మహాశివరాత్రినాడు.. పూజలు చేసిన అనంతరం. ఆయన నోటి వెంట ఈ డైలాగులు రావడం ఆశ్చర్యంగా అనిపించింది. యూపీలో రక్షణ కారిడార్ అందుబాటులోకి రానుంది. 2018లో దీనికి ఇక్కడ శంకుస్థాపన చేశారు.
ఇక్కడ, ఆత్మనిర్భర్ లో భాగంగా.. స్వదేశీ ఫిరంగులను తయారు చేయనున్నారు. చేస్తున్నారు కూడా! ఇది త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్నే ప్రస్తావించిన సీఎం యోగి.. ఇక్కడ తయారు చేసిన ఫిరంగులు గర్జించడం మొదలు పెడితే.. ప్రపంచ పటం నుంచి పాకిస్థాన్ అదృశ్యమవుతుందని అన్నారు.
బుందేల్‌ఖండ్ రీజియన్‌లోని బాందాలో నిర్వహించిన కలింజార్ మహోత్సవ ప్రారంభ వేడుకల్లో ఆయన మాట్లాడారు. బుందేల్‌ఖండ్ రీజియన్‌ను అభివృద్ధి చేసేందుకు బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ హైవేను నిర్మించినట్లు యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. యూపీలో రక్షణ కారిడార్ నిర్మాణం జరుగుతోందన్న ఆయన.. ఇక్కడ తయారు చేసిన ఫిరంగులు గర్జించడం ప్రారంభిస్తే.. పాక్ గుండెల్లో వణుకు పుట్టడం ఖాయమని చెప్పారు.
భారత్ ఏరోస్పేస్, రక్షణ విభాగాల కోసం విదేశీ సరఫరాదారులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఉత్తర్‌ప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ (యూపీడీఐసీ)ను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు రూ.3,700కోట్లతో ఈ ప్రాజెక్టును 2018 ఆగస్టులో ప్రారంభించారు. వచ్చే ఏడాది మొదట్లో ఇది అందుబాటులోకి రానుంది.