ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా.. ఓటమి గాయాలు వెంటాడుతున్నా.. అదే వక్రబుద్దితో భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలన్న కుట్రలు చేసే పాక్.. ఇప్పటివరకు కార్గిల్ యుద్దాన్ని అధికారికంగా ఒప్పుకున్నది లేదు. తాజాగా ఆ దేశ ఆర్మీ అధికారి ఒకరు తన ప్రసంగంలో కార్గిల్ యుద్ధాన్ని ప్రస్తావిస్తూ.. అమరులైన తమ సైనికుల త్యాగం గురించి ప్రస్తావించిన నేపథ్యంలో కార్గిల్ యుద్ధాన్ని పాతికేళ్ల తర్వాత పాకిస్థాన్ ఒప్పుకున్నట్లైంది. ఇంతకాలం కార్గిల్ యుద్ధంలో తమ ప్రమేయం లేదంటూ కొట్టిపారేసే పాక్.. ఇన్నేళ్ల తర్వాత ఒప్పుకోవటం గమనార్హం.
పాకిస్థాన్ రావల్పిండిలోని పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయంలో డిఫెన్స్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కారణంగానే పాక్ చేసిన తప్పుడు పనులుబయట ప్రపంచానికి అధికారికంగా వెల్లడైన పరిస్థితి. భారత – పాకిస్థాన్ మధ్య 1948, 11965, 1971, కార్గిల్.. సియాచిన్ ఘర్షణల్లో వేలాది మంది తమ సైనికులు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. దీంతో.. కార్మిగల్ యుద్ధంలో పాక్ సైన్యం పాల్గొన్న విషయాన్ని పాకిస్థాన్ అంగీకరించినట్లైంది.
ముజాహిదీన్ ల ముసుగులో భారత నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన శత్రుసేనలు.. కార్గిల్ లో ఖాళీగా ఉన్న మన స్థావరాల్ని వశం చేసుకోవటం తెలిసిందే. 1999 మే – జులై మధ్యలో జరిగిన ఈ వ్యవహారంతో భారత్ స్పందించి.. పాక్ సైనికులను తరిమేసింది. ఈ నేపథ్యంలోనే భారత సర్కార్ ‘ఆపరేషన్ విజయ్’ ను ప్రారంభించింది. భారత్ ఎదురుదాడి తాకిడికి తట్టుకోలేని పాకిస్థాన్ తోక ముడిచి పారిపోయింది. జులై 26న పాక్ సైన్యాన్ని తరిమి కొట్టిన విషయాన్ని ఇండియన్ ఆర్మీ అధికారికంగా ప్రకటించింది. అప్పటిన నుంచి ప్రతి ఏడాది ఈ రోజును కార్గిల్ విజయ్ దివస్ గా జరుపుకోవటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. కార్గిల్ ఇష్యూతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకునే పాక్.. తన దుర్బుద్దిని దాచుకునే ప్రయత్నం చేసేది. తన కుట్రను అధికారికంగా ఒప్పుకోని దాయాది.. తాజాగా బయటకు వచ్చిన వీడియోతో.. ప్రపంచానికి అసలు నిజం ఏమిటన్నది అర్థమయ్యే పరిస్థితి. నిజానికి గతంలోనే పాక్ దుర్మార్గాల్ని.. కార్గిల్ యుద్ధానికి సంబంధించి ఆ దేశ ఆర్మీ చీఫ్ ముషారఫ్.. ఆయన డిప్యూటీ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ అజీజ్ లు రావల్పిండిలో జరిపిన ఫోన్ సంభాషణలు విడుదల చేయటం తెలిసిందే. గతంలోనూ పాక్ ఆర్మీకి చెందిన అధికారి ఒకరు కూడా కార్గిల్ యుద్ధం గురించి వెల్లడించారు. ఫోర్ మ్యాన్ షో పేరుతో పాక్ నిర్వహించిన ఆ ఆపరేషన్ అట్టర్ ప్లాప్ అయ్యింది. ఇంతకాలం కార్గిల్ యుద్ధం గురించి మాట్లాడేందుకు.. దాన్ని ఒప్పుకునేందుకు ససేమిరా అన్న పాక్.. తాజా వీడియోతో ఒప్పుకోక తప్పని పరిస్థితి నెలకొందని చెప్పాలి.