భారత్ తో కయ్యానికి కాలు దువ్వేందుకు దాయాది దేశం పాకిస్థాన్ ప్రతి క్షణం కారాలు, మిరియాలు నూరుతూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. సందు దొరికితే చాలు సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందానికి తూటాలతో తూట్లు పొడుస్తూ భారత్ ను కవ్విస్తూ ఉంటుంది. ఎల్వోసీ దగ్గర నిత్యం ఘర్షణకు దిగేందుకు సిద్ధంగా ఉండే పాక్…మరో వైపు మాత్రం శాంతి మంత్రం జపిస్తున్నామంటూ ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తుంటుంది.
అయితే, గతంలో జరిగిన శాంతి చర్చల తాలూకు ఒప్పందాలను పాక్ అమలు చేసిన దాఖలాలు చాలా తక్కువనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో దాయాది దేశాల మధ్య చర్చల ప్రస్తావన పెద్దగా రాలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ చర్చల వ్యవహారంపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ఈ క్రమంలోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై పాక్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కూడా అయిన ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు.
భారత్ తో తాము చర్చలకు సిద్ధమని, కానీ, ఆరెస్సెస్ భావజాలమే అందుకు అడ్డంకిగా మారిందని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశంతో సఖ్యతగా ఉండేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నామని, మధ్యలో ఆరెస్సెస్ భావజాలం వచ్చి చేరేసరికి చర్చల ప్రక్రియ ముందుకు సాగడం లేదని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు.
అయితే, ఆరెస్సెస్‌పై ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కౌశల్ కిశోర్ కౌంటర్ ఇచ్చారు. ఆరెస్సెస్ ఎప్పుడూ సామరస్యాన్నే బోధిస్తుందని , తీవ్రవాద మూలాలు పాక్‌లో ఉన్నాయన్న విషయాన్ని ఇమ్రాన్ మరిచిపోయారని చురకలంటించారు. ఓ వైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ…మరోవైపు చర్చలకు ఆర్ఎస్ఎస్ అడ్డంకి అంటూ విమర్శించి లాభం లేదని, అదో అర్థంపర్థంలేని ఆరోపణల అని కొట్టిపారేశారు.