జాతీయ రాజకీయాల్లో కీలకమైన ఘట్టం ఆవిష్కృతమవుతోంది. ఢిల్లీ వేదికగా 18వ తేదీన నరేంద్రమోడీ ఆధ్వర్యంలో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల సమావేశం జరగబోతోంది. ఇదే సమయంలో 17, 18 తేదీల్లో బెంగుళూరు వేదికగా యూపీఏతో పాటు మరికొన్ని ప్రతిపక్షాలు భేటీ అవుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో బలం పుంజకుని బీజేపీని ఓడించి ఎన్డీయేని గద్దె దింపాలన్నది ప్రతిపక్షాల పట్టుదల. ఇదే సమయంలో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టి ప్రతిపక్షాల సంగతేంటో చూడాలన్నది మోడీ నాయకత్వంలోని బీజేపీ పంతం.
ఎన్డీయేని బలోపేతం చేయటంలో భాగంగా భాగస్వామ్య పార్టీలతో పాటు కొత్తగా కొన్ని పార్టీలను మిత్రపక్షాలుగా చేర్చుకోవాలని బీజేపీ డిసైడ్ చేసింది. ఇందులో భాగంగానే ఎల్జేపీ, జేడీఎస్, అకాలీదళ్ తో పాటు బీహార్లోని ఒకటిరెండు పార్టీలను సమావేశానికి బీజేపీ ఆహ్వనాలు పంపింది. రేపటి ఉదయంలోగా తెలుగుదేశం పార్టీ లాంటి మరికొన్ని పార్టీలకు ఆహ్వానాలు పంపే అవకాశముందని అనుకుంటున్నారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఎన్డీయే సమావేశంలో సుమారు 30 పార్టీలు పాల్గొనే అవకాశముంది.
ఇదే సమయంలో బెంగుళూరు లో జరిగే రెండురోజుల సమావేశానికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తోంది. ఈ సమావేశంలో సుమారు 21 పార్టీలు పాల్గొనే అవకాశముందని అంచనా. ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి చేరుకుంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేని దెబ్బకొట్టడం పెద్ద కష్టం కాదని సీనియర్ నేతలంటున్నారు. నిజానికి పేరుకు మత్రమే ఎన్డీయే కానీ మొత్తం వ్యవహారమంతా బీజేపీనే నడుపుతోంది. ఎందుకంటే ఎన్డీయే బలం 335 ఎంపీలైతే ఇందులో బీజేపీ బలమే 303 ఎంపీలు.
అందుకనే రాబోయే ఎన్నికల్లో బీజేపీని దెబ్బకొట్టాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని సోనియాగాంధీ, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు పదేపదే చెబుతున్నది. అయితే ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రావాలంటే అందుకు పార్టీల అధినేతలు త్యాగాలకు సిద్ధం కావాలి. అప్పుడే బీజేపీ అభ్యర్ధి మీద ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధి పోటీకి సాధ్యమవుతుంది. అప్పుడు మాత్రమే బీజేపీ మెజారిటిని తగ్గించగలవు. ఇదే సమయంలో దక్షిణాదిలో బీజేపీ బాగా దెబ్బతినేసింది. ఇక్కడ బలం పుంజుకోకపోతే రాబోయే ఎన్నికల్లో కష్టమే. ఈ విషయమే మోడీని బాగా కలవరపెడుతన్నది. అందుకనే ఈ రెండు రోజులు దేశ రాజకీయాల్లో చాలా కీలకమైనవనే చెప్పాలి.