నా మతానికి జరిగే అన్యాయం గురించి ప్రశ్నించటం.. గొంతెత్తి మాట్లాడటం తప్పు ఎలా అవుతుంది? హిందువుల మనోభావాల గురించి మాట్లాడితే.. సెక్యురిలిస్టు ఎలా అవుతారన్న సందేహాల నడుమ.. ఏం జరిగినా.. చూసి చూడనట్లుగా ఉంటూ.. ఓపెన్ గా మాట్లాడేందుకు దమ్ముధైర్యం చాలక కిందా మీదా పడే రాజకీయ పార్టీలకు భిన్నంగా జనసేనాని నిలిచారు. హిందువుల మనోభావాల్ని దెబ్బ తీసే శ్రీవారి లడ్డూ ప్రసాదం దుర్మార్గంపై ఓపెన్ గా మాట్లాడే విషయంలో పవన్ కు సాటి వచ్చే రాజకీయ అధినేత ఎవరూ కనిపించరు.
తప్పును ఎత్తి చూపటమే కాదు.. నిప్పులు చెరిగే క్రమంలో అన్య మతానికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించి.. వాళ్లకు అలా జరిగితే ఇలానే ఉంటుందా? అన్న మౌలిక ప్రశ్నను సూటిగా అడిగే ధైర్యం పవన్ కు మాత్రమే సాధ్యం. పవిత్రమైన తిరుమల లడ్డూ తయారీలో కల్తీ దుర్మార్గమైన చర్యగా అభివర్ణించిన పవన్.. హిందువుల మనోభావాల్ని దెబ్బ తీసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టమన్న సీరియస్ వార్నింగ్ ఇచ్చేశారు.
అదే సమయంలో తప్పు చేసిన అంశంపై వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పు పట్టటమే కాదు.. ఆయనకు ఎక్కడ తగలాలో అక్కడే తగిలే వ్యాఖ్యలు చేయటం చూసినప్పుడు ఇలాంటివి పవన్ కు మాత్రమే సాధ్యమన్న భావన కలుగక మానదు. ‘ఇదే ఒక చర్చికి అపవిత్రం జరిగితే జగన్ ఊరుకుంటారా?’ అంటూ చేసిన వ్యాఖ్య ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక సున్నితమైన అంశంపై ధర్మాగ్రహాన్ని ప్రదర్శించే వేళ.. తమ ధర్మం గురించి తప్పించి.. వేరే అంశాన్ని మాట్లాడేందుకు ఇతర రాజకీయ అధినేతలు పెద్దగా ఇష్టపడరు. కానీ.. పవన్ అలా కాదు. ఉన్నది ఉన్నట్లుగా.. ముఖం మీద సూటిగా.. సుత్తి లేకుండా చెప్పేయటం కనిపిస్తుంది. నిజానికి ఈ తరహా వ్యాఖ్య సాహసోపేతమైన చర్యగా చెప్పాలి.
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జరిగిన కల్తీ అంశంపై తాను చేపట్టిన ప్రాయశ్చిత దీక్షతో అయిపోలేదని.. రానున్న రోజుల్లో మరింత ఉండనుందన్న విషయాన్ని తన తాజా వ్యాఖ్యలతో పవన్ స్పష్టం చేశారని చెప్పాలి. ‘‘గత పాలకుల హయాంలో జంతు అవశేషాలతో కల్తీ అయిన నేతితో చేసిన తిరుమల లడ్డూలు అయోధ్య రామ జన్మభూమికి పంపారు. తిరుమలలో అపవిత్ర చర్యలకు పాల్పడ్డ వారి గురించి క్యాబినెట్, అసెంబ్లీలో చర్చించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని చెప్పిన వైనాన్ని చూస్తే.. వచ్చే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోనూ ఈ అంశం ఉంటుందన్న విషయాన్నిపవన్ స్పష్టం చేశారని చెప్పాలి.
హిందువుల మనోభావాల గురించి సీరియస్ గా మాట్లాడుతున్న పవన్ లో అభినందించాల్సిన అంశం ఏమంటే.. వారి ప్రయోజనాల గురించి మాట్లాడుతూనే.. అన్య మతాల మీద అనవసరమైన మాటలు మాట్లాడకపోవటం. నిజానికి ఈ స్థాయి పరిణితి ఉన్న రాజకీయ అధినేతలు మనకు తక్కువే. మొత్తంగా చూసినప్పుడు హిందుత్వకు.. సనాతన ధర్మానికి నష్టం వాటిల్లితే నిప్పులు చిమ్మే అధినేతగా నిలవటమే కాదు.. అన్యమతాలకు మర్యాదను ఇచ్చే కొత్త బాధ్యతను పవన్ తీసుకున్నట్లుగా చెప్పాలి.