తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వినియోగిస్తున్నారని సీఎం చంద్రబాబు ఆరోపించిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వినియోగం చిన్న విషయం కాదని, జగన్ హయాంలో ఎంపికైన కాంట్రాక్టరే ఇప్పటికీ నెయ్యి సరఫరా చేస్తున్నారని అన్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని , ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు ఎందుకు లైట్ గా తీసుకున్నారని ప్రశ్నించారు.
లడ్డూ నాణ్యతపై రిపోర్ట్ వచ్చి చాలా రోజులు అవుతోందని, దానిపై చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన నివేదికను బయటపెట్టలేదని, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇప్పుడు నివేదిక గురించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. లడ్డూ అంశంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్ చేశారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై రాష్టర గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు.
ఇఖ, తన సోదరుడు వైఎస్ జగన్ పై షర్మిల మరోసారి సంచలన రీతిలో విమర్శలు గుప్పించారు. వైఎస్సార్ తో జగన్ కు ఏ మాత్రం పోలిక లేదని షాకింగ్ కామెంట్లు చేశారు. వైసీపీ నుంచి ఒక్కొక్క నేత వెళ్లిపోతున్నారని, త్వరలో వైసీపీలో జగన్ తప్ప ఎవరూ మిగలరని జోస్యం చెప్పారు. సజ్జల, విజయసాయిరెడ్డి కూడా వైసీపీకి గుడ్ బై చెబుతారని అన్నారు.