ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కీలక నేతలంతా ఒకరి తర్వాత ఒకరు వైసీపీని వీడుతున్నారు. ఇటీవలె పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఆ తర్వాత మాజీ డిప్యూటీ సీఎం, మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేశారు.
ఇంకా ఇది మరవక ముందే వైసీపీకి మరో గట్టి షాక్ తగిలింది. ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేయూరి బుజ్జితో పాటు 12 మంది కార్పొరేటర్లు వైసీపీకి గుడ్ బై చెప్పారు. వీరు జగన్ కు తమ రాజీనామా అందించి నాయుడుపాలెంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో టీడీపీలో చేరారు. దీంతో ఒంగోలు మేయర్ పీఠం అధికార పార్టీ సొంతమైంది.
50 స్థానాలు ఉన్న ఒంగోలు కార్పొరేషన్ లో వైసీపీకి 41, టీడీపీకి 6, జనసేనకు 1, స్వతంత్రులు 2 స్థానాల్లో ఉన్నారు. అయితే తాజా పరిణామంతో వైసీపీ బలం 22 స్థానాలకు పడిపోయింది. ఇక వరుస వలసలతో రోజురోజుకు వైసీపీ ఖాళీ అవుతుండటంతో.. ఇలాగైతే వైసీపీ భవిష్యత్తు కష్టమే జగన్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైర్లు పేలుస్తున్నారు.