దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన బాలీవుడ్ కాదంబరి కేసు కీలకమలుపు తిరిగింది. ముంబయికి చెందిన పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ మీద నటి పెట్టిన కేసును ఎత్తేసేందుకు వీలుగా గత ప్రభుత్వంలోని కీలక స్థానాల్లో ఉన్న వారు వైసీపీ నేత చేత ఒక ఫిర్యాదు చేయించటం.. అందులో భాగంగా ఆమెను.. ఆమె తల్లిదండ్రుల్ని అరెస్టు చేసి జైల్లో పెట్టటం.. వేధింపులకు గురి చేయటం లాంటి దారుణ కాండ గురించి ఇప్పటికే తెలిసిందే.
ఈ కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ చేసిన ఫిర్యాదుకు అవసరమైన నకిలీ పత్రాల్ని క్రియేట్ చేసిన లాయర్ నను తాజాగా గుర్తించారు. ఒంగోలుకు చెందిన ఈ అన్యాయ లాయర్.. తప్పుడు పత్రాల్ని క్రియేట్ చేయటంలో మహా దిట్టగా చెబుతుంటారు.
క్రిష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో సినీ నటి కాదంబరి జెత్వానీ మీద ఫోర్జరీ.. మోసం కేసు నమోదు కావటం తెలిసిందే. ఇది కూడా వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ చేసిన కంప్లైంట్ తో. అతడి ఫిర్యాదులో పేర్కొన్న ముఖ్యమైన అంశం.. నటి అరెస్టుకు కారణంగా చూపిన అంశం.. తప్పుడు పత్రాలతో తన భూమిని కాదంబరి జెత్వానీ వేరే వారికి అమ్మే ప్రయత్నం చేశారన్నది. అయితే.. కంప్లైంట్ చేసిన విద్యాసాగరే తప్పుడు పత్రాల్ని కూడా క్రియేట్ చేసిన వైనాన్ని పోలీసులు గుర్తించారు.
సజ్జన్ జిందాల్ ను సేవ్ చేసేందుకు గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు ఈ దారుణానికి తెర తీసిన వైనం వెలుగు చూసింది. షాకింగ్ గా మారిన ఈ ఉదంతంలో గత ప్రభుత్వంలోని అధికార పార్టీ నేతలు.. సీనియర్ ఐపీఎస్ అధికారుల ప్రమేయం బయటకు రావటం.. ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ లను ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఆదేశాల్ని జారీ చేశారు. నటి అరెస్టుకు దారి తీసిన ఫోర్జరీ పత్రాల విషయానికి వస్తే.. విద్యాసాగర్ కు చెందిన భూమిని తప్పుడు పత్రాలతో ఇతరులకు అమ్మే ప్రయత్నం చేశారన్న దానికి అవసరమైన తప్పుడు పత్రాల్ని ఒంగోలుకు చెందిన ప్రముఖ న్యాయవాది కీలకంగా వ్యవహరించి… ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేయించి ఇచ్చినట్లుగా తాజాగా గుర్తించారు.
క్లిష్టమైన కేసుల్లో న్యాయ సలహాల కోసం దర్యాప్తు అధికారులు ఆయన సలహాలు.. సూచనలు పాటిస్తారని చెబుతారు. గత ప్రభుత్వ హయాంలో సంచలనంగా మారిన పలు కేసుల్లో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించినట్లుగా సమాచారం. అప్పటి ప్రతిపక్ష నేతలపై నమోదైన బోలెడు అక్రమ కేసులకు సంబంధించి దర్యాఫ్తు అధికారులకు ఆయన స్క్రీన్ ప్లే సిద్ధం చేసేవారని చెబుతారు. దీంతో.. రాష్ట్రస్థాయి వైసీపీ నేతలతో పాటు.. కీలక అధికారులు కూడా టచ్ లో ఉండేవారని తెలుస్తోంది.
ముంబయి నటి కాదంబరి ఎపిసోడ్ లోనూ.. ఆమె అరెస్టుకు అవసరమైన స్క్రీన్ ప్లే మాత్రమే కాదు.. అవసరమైన తప్పుడు డాక్యుమెంట్లను సైతం సిద్ధం చేసి ఇచ్చారని చెబుతున్నారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించి అతడికి ఖరీదైన కారు ఒకటి బహుమతిగా లభించి ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే.. ఈ కేసు మరో మలుపు తిరగటమే కాదు.. సదరు న్యాయవాది పాత్రపై అధికారిక ప్రకటన ఎప్పుడు ఉంటుందన్న ఉత్కంట నెలకొంది.