వైసీపీ భూతాన్ని శాశ్వతంగా పూడ్చి పెట్టాలని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో ప్రస్తుతం జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయిందని అన్నారు. అన్ని వేల కోట్ల అప్పులు చేసి కూడా ఏం చేశారో.. దేనికి ఖర్చు పెట్టారో కూడా తెలియని పరిస్థితి నెలకొందని తెలిపారు. పోతూ పోతూ.. భారీ స్థాయిలో బకాయిలు పెట్టిపోయారని.. వాటన్నింటి నీ తీర్చలేక తలప్రాణం తోకకు వస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏటా ఇచ్చే విపత్తుల నిధులను కూడా వైసీపీ సర్కారు వాడేసిందని తెలిపారు.
అయితే.. వాడేసిన సొమ్ముకు లెక్కలు కూడా చెప్పలేదని, దీనిని ఏ విధంగా ఖర్చు చేశారో కూడా తెలియడం లేదని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వ పాపాలు ఇప్పటికీ వెంటాడుతున్నాయని చెప్పారు. “విపత్తుల కోసం ఇచ్చిన నిధులను కూడా వాడేశా రు. పోనీ.. దేనికి ఖర్చు పెట్టారో కూడా చెప్పడం లేదు. రికార్డులు లేవు. సరైన లెక్కలు కూడా లేవు. వీరిని ఏం చేయాలి? “ చంద్రబాబు ప్రశ్నించారు. అందుకే వైసీపీ భూతం ఇంకా వెంటాడుతున్నట్టే ఉందని అన్నారు. ఈ బూతాన్ని శాశ్వతంగా పూడ్చి పెట్టాలని చంద్రబాబు అన్నారు.
బుడమేరు ప్రాంతం పూర్తిగా ఆక్రమణలకు గురైందని.. గత పాలనలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారని.. కనీసం గండి పూడ్చేందుకు కూడా ప్రయత్నించలేదని చంద్రబాబు దుయ్యబట్టారు. అందుకే చరిత్రలో ఎరుగని విధంగా ఇంత భారీ ఎత్తున వరదలు వచ్చా యని చెప్పారు. వీటిని పరిష్కరించేందుకు తమకు కాబట్టి పది రోజులు పట్టిందన్నారు. అదే వైసీపీ పాలకులు ఉండి ఉంటే.. ఆరు మాసాలైనా పట్టి ఉండేదన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక అవకతవకలు అన్నీ ఇన్నీ కావని చెప్పారు. ఏకంగా హెడ్లను కూడా తారు మారు చేశారని, అకౌంట్లను కూడా మార్చివేశారని చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
గుజరాత్ పర్యటన ముగించుకుని మంగళవారం ఉదయం విజయవాడకు చేరుకున్న ఆయన.. సచివాలయంలో పలు శాఖలపై సమీక్షలు నిర్వహించారు. నూతన మద్యం విధానం సహా వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ఆయన సమీక్షించారు. బాధితులకు అన్ని విధాలా సాయం చేసిన మంత్రులు, అధికారులను ఆయన అభినందించారు. అనంతరం.. మీడియాతో మాట్లాడిన చంద్రబాబు వైసీపీపై విమర్శలు గుప్పించారు. ఇలాంటి ఉత్పాతాలను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సహకరించారని తెలిపారు.