సినిమా రంగంలో నిర్మాతలు, నిర్మాణ సంస్థలు, నటులు, దర్శకుల మధ్య నగదు లావాదేవీలు సర్వ సాధారణం. ఈ లావాదేవీల నేపథ్యంలో కొన్నిసార్లు చెక్ బౌన్స్ అయిన ఘటనలూ ఉన్నాయి. అయితే, ఆ వ్యవహారాన్ని ఇండస్ట్రీలోపలే సద్దుమణిగేలా చేసి పరిష్కరించుకున్న సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకటి రెండు సందర్భాలు మినహా….కోర్టులకు వెళ్లి మరీ చెక్ బౌన్స్ కేసులు, శిక్షలు పడిన దాఖలాలు లేవు.
అయితే, తాజాగా ప్రముఖ కోలీవుడ్, టాలీవుడ్ నటి రాధికా, ఆమె భర్త, నిర్మాత, నటుడు శరత్ కుమార్ లకు చెక్ బౌన్స్ కేసులో ఏడాది శిక్ష పడడం ఇపుడు దక్షిణాది చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది. చెక్ బౌన్స్ కేసులో రాధికతో పాటు శరత్ కుమార్కు న్యాయస్థానం ఏడాది జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. కొద్ది సంవత్సరాలుగా వీరిద్దరూ చెక్ బౌన్స్ కేసును ఎదుర్కొంటున్నారు.
సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో వాదనలు ముగియడంతో ఏడాది శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 2015లో ‘ఇదు ఎన్న మాయం’ సినిమాను రాధిక, శరత్ కుమార్ లు నిర్మించారు. ఆ సినిమా కోసం రేడియంట్ గ్రూప్ అనే కంపెనీ నుంచి పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్నారు. అయితే, ఆ అప్పును వారు సకాలంలో తిరిగి చెల్లించలేదు.
ఆ తర్వాత కొద్ది రోజులకు రేడియంట్ సంస్థకు రాధిక, శరత్ కుమార్ ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది. దీంతో, చెక్ బౌన్స్ కేసులో రేడియంట్ గ్రూప్ 2018లో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే ఆ కేసులో విచారణ జరిపిన చెన్నై స్పెషల్ కోర్టు ఈ రోజు వారికి శిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. మరి, ఈ తీర్పుపై రాధిక, శరత్ కుమార్ లు హైకోర్టులో అప్పీల్ చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.