గోషామహల్ ఎమ్మెల్యే, తెలంగాణ బీజేపీ నేత రాజాసింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు రాజాసింగ్. రాజకీయ ప్రత్యర్థులపై వివాదాస్పద వ్యాఖ్యలతో విరుచుకుపడే రాజాసింగ్…హిందూత్వ ఎజెండాను బలంగా ప్రజల్లోకి తీసుకువెళుతుంటారు. గోరక్షణ కోసం అవసరమైతే సొంతపార్టీపైనా పోరాటానికి సిద్ధమంటూ గతంలో ప్రకటించిన రాజాసింగ్..కాసులకు కక్కుర్తిపడి ఆవుల అక్రమ రవాణాకు తెలంగాణ పోలీసులు సహకరిస్తున్నారంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే గతంలో బీఫ్ ఫెస్టివల్ సందర్భంగా రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆయనను ఇరకాటంలోకి నెట్టాయి. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నాంపల్లి స్పెషల్ కోర్టు జైలు శిక్ష ఖరారు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఐదేళ్ల క్రితం జరిగిన బీఫ్ ఫెస్టివల్ సందర్భంగా రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకుగాను ఆయనకు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది.
జైలు శిక్ష ఖారారు కావడంతో రాజాసింగ్ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. రాజాసింగ్ వాదనలు విన్న నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, నెలరోజుల్లో ఈ విషయాన్ని హైకోర్టులో తేల్చుకోవాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసుల విచారణ నాంపల్లి స్పెషల్ కోర్టులో జరుగుతున్న సంగతి తెలిసిందే. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, మంత్రి మల్లారెడ్డిలపై ఎన్నికల కోడ్ ఉల్లంఘనతోపాటు పలు సెక్షన్ల కింద వేర్వేరుగా నమోదైన కేసులపై నాంపల్లి స్పెషల్ కోర్టు విచారణ జరిపింది. కరీంనగర్లో బండి సంజయ్‌పై నమోదైన మూడు కేసులను న్యాయస్థానం కొట్టివేయగా…మల్లారెడ్డిపై నమోదైన కేసులను కొట్టివేయడానికి నాంపల్లి కోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. తాజాగా, జైలుశిక్ష విధించిన నేపథ్యంలో ఇకపై రాజాసింగ్ తన దూకుడును తగ్గిస్తారా…లేక యథాతధంగా కొనసాగిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.