ఏపీ రాజధాని అమరావతిలోనే ఉండాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. రాజధాని కోసం 365 రోజులుగా రైతులు, మహిళలు, వృద్ధులు రోడ్డెక్కి పోరాడుతున్నారని… ఏడాది పాటు నిరంతర పోరాటం జరగడం అరుదైన విషయం అన్నారు. అమరావతి లాంటి ఉద్యమం ప్రపంచంలో ఎక్కడా లేదు అని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.
అమరావతిపై ప్రభుత్వ మొండి వైఖరి వల్ల భవిష్యత్తుపై బెంగతో 105 మంది రైతులు దిగులుతో ప్రాణాలు కోల్పోయారన్నారు. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని సోము వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. హింసకు తావు లేకుండా శాంతియుత పోరాటం చేస్తున్న రైతులను భయబ్రాంతులను చేసే ప్రయత్నం జరుగుతుందోన్నారు. అయినా ఎవరూ భయపడవద్దన్నారు. ‘ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని’ నినాదంతో రైతులు ముందుకు సాగుతున్నారని తెలిపారు. జగన్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతందని విమర్శించారు. అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ ఈఆలోచనలను విరమించుకోవాలని సోము వీర్రాజు హితువు పలికారు.
ఇదంతా ఓకే గాని గతంలో ఆంధ్రకు 13 రాజధానులు కావాలని చెప్పిని మహానుభావుడు ఈయనే. రాజధాని కేంద్రం పరిధిలోనిది కాదు అని చెప్పిన వారిలో ఈయనా ఒకరు. పార్టీలో చేరిన వారిపై సీబీఐ కేసులు పక్కన పెట్టే కేంద్రం…. అమరావతి విషయంలో మాత్రం పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అని కాకమ్మ కబుర్లు చెబుతోంది. అయినా, కోర్టులను నమ్ముకుని వారు పోరాటం చేస్తున్నారు ఏ జగన్ ను నమ్ముకునో కాదు. బీజేపీని నమ్ముకుని కూడా కాదు.