ఈ ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబు చెప్పు.. దేవుడా!!

ఇన్ని సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్న మా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. దైవాంశ సంభూతుడు అధ్య‌క్షా!! - మంత్రి అప్ప‌ల‌రాజు.
మా మంత్రిగారు.. మా ముఖ్య‌మంత్రిని దైవాంశ సంభూతుడు అన్నారు అధ్య‌క్షా.. కానీ.. నా దృష్టిలో ఆయ‌న దేవుడే అధ్య‌క్షా - ఎమ్మెల్యే జోగి ర‌మేష్‌
ఇవ‌న్నీ చూస్తే.. నాకు కూడా చాలా ఆశ్చ‌ర్యంగా ఉంది. అరాచ‌కాల‌ను అరిక‌ట్టేందుకు వ‌చ్చిన దేవ‌దూత‌గా ముఖ్య‌మంత్రి క‌నిపిస్తున్నారు- స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం(నిండు స‌భ‌లో ప్ర‌క‌ట‌న‌)

క‌ట్ చేస్తే..

ఆ దైవాంశ‌సంభూతుడు.. ఆ దేవుడు.. ఆ దేవ‌దూత‌కు.. రాజ‌ధాని రైతులు కొన్ని ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. అవేవీ.. వారు రాసుకున్న‌వికావు. వారి మ‌న‌సులోని భావాలు అంత‌క‌న్నా కావు.. 2019 ఎన్నిక‌ల‌కు ముందు.. 2014-19 మ‌ధ్య కాలంలో వైసీపీ అధినేతగా జ‌గ‌న్ ఆయ‌న పార్టీ నాయ‌కులు  ప‌లు సంద‌ర్భాల్లో చేసిన ప్ర‌క‌ట‌న‌లే! వాటినే ఇప్పుడు అమ‌రావ‌తి అన్న‌దాత‌లు అడుగుతున్నారు. వీటికి స‌మాధానం చెప్పాల‌ని అంటున్నారు. మ‌రి చెబుతారా?.. చెప్పే ధైర్యం ఉందా?.. ముందు.. ప్ర‌శ్న‌లేమిటో చూద్దాం..

జ‌గ‌న్ మాట‌: అధ్య‌క్షా.. అమ‌రావ‌తి కేపిట‌ల్ సిటీకి మేం సంపూర్ణంగా స‌హ‌క‌రిస్తాం. మేం మ‌న‌స్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఇప్ప‌టికే మ‌న రాష్ట్రం 13 జిల్లాల‌తో చాలా చిన్న‌దిగా ఉంది. అందుకే గుంటూరు-విజ‌య‌వాడల మ‌ధ్య రాజ‌ధాని ఏర్పాటు మంచిద‌ని భావిస్తున్నాం (2014, న‌వంబ‌రు 4న అసెంబ్లీలో ప్ర‌క‌ట‌న‌)

రైత‌న్నల ప్ర‌శ్న‌: ఇప్పుడు మూడు రాజ‌ధానుల‌తో రాష్ట్రం పెద్ద‌ద‌వుతుందా?  నాడు సంపూర్ణ మ‌ద్ద‌తు తెలిపిన మీరు యూట‌ర్న్ తీసుకున్నారా?

ఆళ్ల రామ‌కృష్నారెడ్డి(ఎమ్మెల్యే మంగ‌ళ‌గిరి): రాజ‌ధానిని మారుస్తామ‌ని కొంద‌రు ప్ర‌చారం చేస్తున్నారు. దీనిలో వాస్త‌వం లేదు. అమ‌రావ‌తే శాశ్వ‌త రాజ‌ధాని. రేపు మేం అధికారంలోకి రాగానే ముందు దీనికే కొబ్బ‌రికాయ కొడ‌తాం-(2018, ఏప్రిల్ 7)

రైత‌న్నల ప్ర‌శ్న‌:  నాటి ప్ర‌చారం త‌ప్ప‌న్నారు.. నేడు ఏం చేస్తున్నారు?

ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు(మాజీ మంత్రి): రాజ‌ధానికి పూర్తి స‌హ‌కారం ఉంటుంది. రాజ‌ధానిని వైసీపీ నేత‌లు అడ్డుకుంటున్నార‌న్న టీడీపీ నేత‌ల ప్ర‌చారం కేవ‌లం ఓటు బ్యాంకు కోస‌మే!-(2014, న‌వంబ‌రు 13)

అన్న‌దాత‌ల ఆక్రోశం:  ఇప్పుడు అడ్డు ప‌డుతోందెవ‌రు?

పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి(మంత్రి): వైసీపీ అధికారంలోకి వ‌స్తే.. అమ‌రావ‌తిని త‌ర‌లిస్తామ‌నే ప్ర‌చారంలో ప‌స‌లేదు. మేం రాగానే అభివృద్దిని ప‌రుగులు పెట్టిస్తాం-(2018, డిసెంబ‌రు 16)

రైత‌న్న‌ల ప్ర‌శ్న‌:  అభివృద్ది ఏది?  త‌ర‌లింపు నిజం కాదా?

ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు(ఎమ్మెల్సీ): వైసీపీ అధికారంలోకి వ‌స్తుంది. రాజ‌ధానిగా అమ‌రావ‌తే ఉంటుంది. స్థానిక వాసి(గుంటూరు)గా నాదీ హామీ. దీనిని మేనిఫెస్టోలోనూ పెడ‌తాం(వైసీపీ మేనిఫెస్టో క‌మిటీ చైర్మ‌న్‌)-(2019, ఫిబ్ర‌వ‌రి 26)

రైత‌న్న ప్ర‌శ్న‌:  మేనిఫెస్టోలో పెట్టారా?  మీ హామీని నిల‌బెట్టుకున్నారా?

రోజా(ఎమ్మెల్యే):  చంద్ర‌బాబు జిమ్మిక్కులు చేశారు. డిజిట‌ల్ అమ‌రావ‌తిని సృష్టించారు. కానీ.. జ‌గ‌న్ సీఎం కాగానే వాస్త‌వం చేస్తారు. భారీ క‌ట్ట‌డాలు క‌డ‌తారు(2019, మార్చి 10)

రైతుల ప్ర‌శ్న‌:  మీరు చేసేవి ఏమిటి?  భారీ క‌ట్ట‌డాలు కూల్చ‌డ‌మేనా?!

కొస‌మెరుపు: మ‌రి ఈ రైతుల ప్ర‌శ్న‌ల‌కు ఆ దేవుడు స‌మాధానం చెబుతారా?  చెప్పే సాహ‌సం చేయ‌గ‌ల‌రా?  ఏడాది పూర్తి చేసుకున్న రాజ‌ధాని ఉద్య‌మానికి ఫుల్ స్టాప్ పెట్టి.. రైత‌న్న‌ల కోరిక నెర‌వేరుస్తారా?  చూడాలి!!

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.