ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా జగన్ అలివిగాని అడ్డగోలు హామీలిచ్చిన సంగతి తెలిసిందే. జనాన్ని నమ్మించి ఓట్లు కొల్లగొడితే చాలనుకున్న జగన్….నవరత్నాలంటూ సంక్షేమ పథకాల పేరుతో ఒక్క చాన్స్ అంటూ ఓట్లడిగారు. ఆ హామీల్లో భాగంగానే..అవ్వా, తాతల పెన్షన్లను మూడు వేలు చేస్తానన్న జగన్…మాట తప్పారు. తూచ్ తాను అలా అనలేదని….పెన్షన్ లను 2వేల రూపాయల నుంచి పెంచుకుంటూ…పోతానని చెప్పానంటూ బుకాయించారు. ఇక, అర్హులైన వారందరికీ అతి తక్కువ సమయంలోనే పెన్షన్ మంజూరు చేస్తానని చెప్పిన జగన్….అనర్హులకు అందలం వేయడంతోపాటు…అర్హులైన వేలాది మంది పెన్షన్లకు కోత పెట్టారు.
రకరకాల కారణాలు చెప్పి చాలామంది వృద్ధుల పెన్షన్లను జగన్ సర్కార్ నిలిపివేసింది. ఆ పెన్షన్ పై ఆధారపడిన ఎందరో అవ్వాతాతల నోటికాడ కూడును ఈ ప్రభుత్వం లాగేసింది. ఈ క్రమంలోనే అన్యాయంగా తన పెన్షన్ ను నిలిపివేశారంటూ ఓ అవ్వ హైకోర్టు మెట్లెక్కింది. చివరకు హైకోర్టులో జగన్ సర్కార్ పై విజయం సాధించిన ఆ అవ్వ..తనకు రావాల్సిన పెన్షన్లను బకాయిలతో సహా ముక్కుపిండి వసూలు చేసింది.
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం నావూరుపల్లికి చెందిన కాకర్ల సరోజనమ్మ (65)కు 2019 నుంచి వృద్ధాప్య పెన్షన్ వస్తోంది. అయితే, జనవరి 2020 నుంచి ఆమెకు పెన్షన్ హఠాత్తుగా ఆగిపోయింది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా….24 ఎకరాల పొలం ఉందన్న కారణంతో పెన్షన్ ఆపేశామని చెప్పారు. కానీ, తనకున్నది 4.90 ఎకరాల మెట్ట భూమి మాత్రమేనని, దానికి పెన్షన్ తీసేయాలన్న నిబంధన వర్తించదని ఆమె చెప్పినా… ఫలితం లేకుండా పోయింది. దీంతో చివరకు ఆమె గత ఏడాది అక్టోబరులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ బట్టు దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం నెల రోజుల్లో సరోజనమ్మ పెన్షన్ పునరుద్ధరించాలని ఆదేశించింది. అంతేకాదు, పెండింగ్ లో ఉన్న 22 నెలల కాలానికి సంబంధించి మొత్తం పెన్షన్ లెక్కకట్టి దానిని కూడా చెల్లించాలని ఆదేశించింది.
అయితే, గత నెలలో సరోజనమ్మ పెన్షన్ పునరుద్ధరించినా…22 నెలల కాలానికి సంబంధించిన సొమ్ము మాత్రం చెల్లించలేదు. దీంతో, సరోజనమ్మ మరోసారి హైకోర్టును ఆశ్రయించి అధికారులపై కోర్టు ధిక్కారణ పిటిషన్ వేశారు. దీంతో, వెంటనే స్పందించిన అధికారులు 22 నెలల పెన్షన్ మొత్తం రూ.47,250లను సరోజనమ్మకు అందించారు. ఏది ఏమైనా…జగన్ సర్కార్ పై పోరాడి తన పెన్షన్ ను సాధించుకున్న ఈ అవ్వ ఎందరికో స్ఫూర్తిదాయకం అనడంలో ఎటువంటి సందేహం లేదు.