మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ సన్న బియ్యం ఇస్తామంటూ ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి మడమ తిప్పిన సీఎం జగన్….తూచ్ మేము సన్న బియ్యం ఇస్తామన లేదు నాణ్యమైన బియ్యం ఇస్తామన్నామంటూ మాట మార్చారు. అంతేకాదు, సన్నబియ్యం విషయంలో ‘సాక్షి’ తప్పు రాసిందంటూ అసెంబ్లీలో జగన్ స్వయంగా అంగీకరించారు. దీంతో, జగన్ సాక్షి విశ్వసనీయతను కాకుండా….మనస్సాక్షిని నమ్మాలని అప్పట్లో ప్రతిపక్ష నేతలు నిలదీసిన వైనం సంచలనం రేపింి.
ఈ నేపథ్యంలోనే తాజాగా విజయవాడలో రేషన్ లబ్ధిదారు అయిన ఒక మహిళ….ఎమ్మెల్యే మల్లాది విష్ణును సన్నబియ్యంపై నిలదీసిన వైనం చర్చనీయాంశమైంది. ‘‘మీరు అధికారంలోకి వస్తే సన్నబియ్యం ఇస్తామన్నారు…ఇవేనా సన్న బియ్యం’’ అంటూ దుర్గమ్మ అనే వృద్ధురాలు విష్ణును ప్రశ్నించిన వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. దీంతో, జగన్ బాటలోనే మల్లాది విష్ణు కూడా తాము నాణ్యమైన బియ్యం ఇస్తామని చెప్పామంటూ అక్కడి నుంచి జారుకున్నారు.
విజయవాడలోని అజిత్ నగర్ లో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో విష్ణుకు ఈ చేదు అనుభవం ఎదురైంది. బియ్యం బాగోలేవని ఈ బియ్యంతో అన్నం సరిగ్గా ఉడకడం లేదని దుర్గమ్మ వాపోయింది. అయితే, అలా ఏం ఉండదని, బియ్యం బాగానే ఉన్నాయని మల్లాది విష్ణు చెప్పారు. దీంతో, తన ఇంట్లో నుంచి లావుగా దుమ్ముతో ఉన్న బియ్యాన్ని దుర్గమ్మ చూపించి మల్లాది విష్ణును నిలదీసింది. ఈ బియ్యంతో అన్నం వండుకుని ఎలా తినాలని ప్రశ్నించింది.