టాలీవుడ్లో ఇప్పుడు ఫ్రాంచైజీ చిత్రాల జోరు పెరుగుతోంది. ఒక హిట్ సినిమాలో క్యారెక్టర్స్, థీమ్ మాత్రమే తీసుకుని కొత్త కథ సిద్ధం చేసుకుని ఇంకో సినిమా తీయడమే ఈ ఫ్రాంఛైజీ చిత్రాల స్టైల్. ఎఫ్-2, కార్తికేయ లాంటి చిత్రాలకు కొనసాగింపుగా ఈ ఏడాది సినిమాలు రావడం తెలిసిందే.
అందులో ఎఫ్-3 ఓ మోస్తరు ఫలితాన్ని అందుకోగా.. కార్తికేయ-2 బ్లాక్‌బస్టర్ అయింది. ఇక త్వరలోనే విడుదల కానున్న హిట్-2 సైతం సూపర్ హిట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన ప్రోమోలన్నీ ఆకట్టుకున్నాయి. సినిమా మీద అంచనాలు పెంచాయి.
హిట్-2 టీజర్ లాంచ్‌కు ముందు రిలీజ్ చేసిన ఒక వీడియోలో దర్శకుడు శైలేష్ కొలను.. ‘హిట్ మల్టీవెర్స్’ గురించి, అలాగే హిట్-3 గురించి మాట్లాడడం తెలిసిందే. హిట్-2 ఓ మోస్తరుగా ఆడినా చాలు.. హిట్-3 తెరకెక్కడం పక్కా. ఈ సినిమా సక్సెస్ మీద ధీమాగా ఉన్న శైలేష్ అండ్ టీం ఆల్రెడీ మూడో భాగం కోసం కథతో పాటు కాస్ట్‌ను కూడా ఖరారు చేసేసినట్లు సమాచారం.
హిట్-3లో అడివి శేష్ కొనసాగడమే కాక… ‘హిట్’ సినిమాల నిర్మాత నాని.. ఇంకా తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలు పోషిస్తారన్నది తాజా సమాచారం. దీని గురించి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతే కాదు ‘హిట్-3’ కథ మొత్తం అమెరికా నేపథ్యంలో సాగుతుందని.. కమల్ హాసన్-గౌతమ్ మీనన్‌ల సినిమా ‘వేట్టయాడు విలయాడు’ను తలపించేలా ఇది ఉంటుందని అంటున్నారు.
విజయ్ సేతుపతి నటిస్తున్నాడంటే కచ్చితంగా అతడిది నెగెటివ్ క్యారెక్టరే కావచ్చు. సేతుపతి రేంజికి శేష్ ఒక్కడే సరిపోడు కాబట్టి నాని కూడా తోడవుతాడని భావించవచ్చు. కాకపోతే సాఫ్ట్‌గా కనిపించే నాని పోలీస్ పాత్రలో ఎలా మెప్పిస్తాడన్నది ఆసక్తికరం. మొత్తానికి కాంబినేషన్ అయితే చాలా క్రేజీగా అనిపిస్తోంది. డిసెంబరు 2న ‘హిట్-2’ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే కొన్ని రోజుల్లోనే ఈ సినిమాను అనౌన్స్ చేసే అవకాశముంది.