ప్రస్తుతం ఏపీలో నెలకొన్న.. స్థానిక ఎన్నికల వివాదం ఎటు మలుపు తిరుగుతుంది? ఎవరుపైచేయి సాధిస్తారు? సర్కారా? రాష్ట్ర ఎన్నికల కమిషనరా? రేపు 18న రెగ్యులర్ పద్ధతిలో విచారణ చేపడతామని చెప్పిన హైకోర్టు.. తన విచారణలో ఎలాంటి తీర్పు ఇస్తుంది? ప్రస్తుతం రాజకీయ వర్గాలను తీవ్రస్థాయిలో మథన పడేలా చేస్తున్న ప్రశ్నలు ఇవి. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి.. కమిషనర్ ఇచ్చిన షెడ్యూల్‌ను సింగిల్ జడ్జి ధర్మాసనం కొట్టేసింది. అయితే.. గంటల వ్యవధిలో నే ఈ తీర్పును కమిషనర్.. డివిజన్ బెంచ్‌లో సవాలు చేశారు. ఈ నెల 18న దీనిపై విచారణ చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.
అయితే.. ఈ నెల 18న హైకోర్టు డివిజన్ బెంచ్ విచారించి వెనువెంటనే లేదా మరుసటి రోజో.. ఖచ్చితంగా తీర్పు ఇచ్చేస్తుంది. ఎందుకంటే.. మరో నాలుగు రోజుల్లో షెడ్యూల్ ప్రకారం ఏర్పాట్లు జరిగిపోవాల్సి ఉంది. సో.. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కోర్టులో బలమైన వాదన వినిపించే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే టైం బౌండ్ విషయాన్ని ఆయన డివిజన్ బెంచ్ వద్ద ప్రస్తావించారు. దీంతో విచారణ ఆలస్యమై నా.. తీర్పు మాత్రం లేటయ్యే ఛాన్స్ కనిపించడంలేదు. ఈ క్రమంలో ఇటు సర్కారుకు అనుకూలంగా వస్తే.. ఎన్నికల కమిషన్, కమిషన్‌కు అనుకూలంగా వస్తే.. రాష్ట్ర సర్కారు సదరు డివిజన్ బెంచ్ తీర్పును సుప్పీం కోర్టులో సవాలు చేసే అవకాశం మెండుగా కనిపిస్తోంది. చేస్తాయి కూడా!
మరి అక్కడి దాకా ఎవరు లాగినా.. ఫలితం ఎలా ఉంటుంది? సుప్రీం తీర్పు ఏవిధంగా ఉండే అవకాశం ఉంది? అనే విషయాన్ని పరిశీలిస్తే.. ఇప్పటి వరకు ఉన్న అనుభవాలు, సుప్రీం కోర్టు కొన్ని వారాల కిందట ఇచ్చిన తీర్పులను బట్టి.. ఎన్నికల కమిషన్‌కే అనుకూలంగా ఉంటుందని అంటున్నారు న్యాయ నిపుణులు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిసా రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలపై దాఖలైన విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యల్లో కీలకమైనవి.. “స్థానిక ఎన్నికలు ఆలస్యం కారాదు.. ప్రత్యేక అధికారుల చేతిలో పంచాయతీలు నలిగిపోరాదు. ఒకసారి షెడ్యూల్ ఇచ్చిన తర్వాత.. నిలిపి వేయడం ఎట్టి పరిస్థితిలో ఆమోదయోగ్యం కాదు!!“ అనే.
కాబట్టి.. ఏపీ విషయంలోనూ సుప్రీం కోర్టు ఇలానే తీర్పు వెలువరించే అవకాశం ఉంటుందని.. ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ స్థానికంపై సుప్రీం కోర్టు.. గత తీర్పులకు భిన్నంగా.. ఏపీకి అనుకూలంగా తీర్పు చెబితే.. తీర్పును తిరగదోడే అవకాశం ఉండనే ఉంటుంది. ఫలితంగా.. గత తీర్పులను మరోసారి సమీక్షించమని కోరే ఛాన్స్ కూడా ఉండనుంది. కాబట్టి.. ఏపీలో నెలకొన్న స్థానికం వివాదాన్ని సుప్రీం కోర్టు వరకు లాగితే.. నష్టపోయేది జగనేని అంటున్నారు పరిశీలకులు. ఏపీ హైకోర్టు తీర్పుతో సంతృప్తి చెంది.. సహకరిస్తే.. బెటరనేది వీరి సూచన. మరి ఏం జరుగుతుందో చూడాలి.