ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీ కలలు కల్లలయ్యాయి..తెలంగాణ దారుల్లో ఓం సిటీ నిర్మాణం అంటూ తనదైన ధార్మిక జగతి నిర్మాణం ఒకటి ఆగిపోయి చాలా కాలం అయింది.ఆర్ఎఫ్సీకి అనుబంధంగా ఏర్పాటు చేయాలనుకున్న కలల సౌధం ఆగిపోయింది.కానీ అదే సమయంలో ఓం సిటీ స్థానంలో మరో ధార్మిక జగత్తు పురుడుపోసుకుంది..చిన జియర్ స్వామి రూపాన ముచ్చింతల్ దారుల్లో విరాజిల్లుతోంది..సమతామూర్తి..పేరిట వెలసిన విగ్రహం అనే సందేహాలకు నెలవు..అవుతోంది.
వైదిక పరంగానూ, రాజకీయ పరంగానూ, శ్రీ రామ నగరం పేరిట వెలసిన ఆశ్రమం అనే సందేహాలకు నెలవు అవుతోంది.ఈ దశలో స్వామీ! మీరే చెప్పండి..ఏది ద్వైతమో..ఏది అద్వైతమో.. ఏది విశిష్టాద్వైతమో? అన్నది మీరు చెబితే వినేందుకు మేం సిద్ధం. కనుక మీడియా మొనగాడు రామోజీకి తన కలల నగర నిర్మాణం ఓం సిటీ పేరిట వాస్తవంలోకి రాకుండా ఆగిపోవడం వెనుక ఏం జరిగింది అంటారు?
2015లో కేసీఆర్ ను కలిసి ఆర్కిటెక్చర్ తో సహా పూర్తయిన పుస్తకం చూపించాక ఆ 108 ఆలయాలు సమతా మూర్తి చుట్టూ ప్రత్యక్ష మయ్యాయి. ఇది అద్భుతమా? మాయనా? ఏం జరిగింది. ఫిలింసిటీ సామ్రాజ్యం కట్టిన రామోజీకి సాధ్యంకానిది, జీయర్ స్వామికి మాత్రం ముచ్చింతల్ లో సాధ్యం అయింది. అంటే రెండు ప్రభుత్వాలు సంకల్పించుకున్న తీరుకు ఇదే నిదర్శనం అని భావించాలా? లేదా రామోజీ హవాకు చెక్ పెట్టిన వైనంకు జియర్ స్వామి ఆలంబన అయ్యారా? ఏమో నిలువెత్తు విగ్రహం చెంత త్రిదండం చేబూనిన ఆ స్వామీజీనే చెప్పాలి.
సమతామూర్తికి దేశమంతా ప్రణమిల్లుతున్న తరుణం ఇది. ముచ్చింతల్ లో వెలసిన జగద్గురు రూపానికి రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రణమిల్లుతున్న తరుణం ఇది. ఇదే సమయంలో కొన్ని సందేహాలు కొన్ని సందిగ్ధతలూ కూడా విరాజిల్లుతున్నాయి అని రాయాలి. సందేహాలను నివృత్తి చేసేంత స్థాయిలో జియరు స్వామి ఆశ్రమ ప్రతినిధులు ఉన్నారో? లేదో ? కానీ రాజకీయ నాయకుల ప్రోద్బలం కారణంగానే వెయ్యి కోట్లు విలువ చేసే ఆశ్రమ నిర్మాణం అన్నది సుసాధ్యం అయింది అన్నది ఇప్పుడు వినిపిస్తున్న లేదా నిర్థారణకు నోచుకుంటున్న వాస్తవం.
ముఖ్యంగా స్వామీజీ అనుచరుల్లో ఇవాళ ఉన్న వారంతా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన గొప్ప, గొప్ప రాజకీయ నాయకులు… కోటీశ్వరులు.. ఇంకా చెప్పాలంటే ప్రాంతాలకు అతీతంగా తమ ఆర్థిక మూలాలను విస్తరింపజేసుకున్న వ్యాపార మరియు రాజకీయ వేత్తలే! కావడం గమనించదగ్గ విషయం.
కనుక అక్కడ సమానత్వం వర్థిల్లే తీరు ఎలా ఉన్నా కూడా రాజకీయం మాత్రం సమానత్వాన్ని అందుకుంటూనే ఉంది. అందరి నాయకులూ, వారి, వారి అన్ని సైద్ధాంతిక భావజాలాలూ కలిసి ఒకే వేదికపై విలసిల్లుతున్నాయి. ఇదంతా సమతా మూర్తి మౌనంగా చూస్తున్నాడు. పాపం! ఆయన ప్రశ్నించలేడు.. నిలదీయలేడు కూడా!
ఆఖరికి గద్దర్ కూడా పాట పాడి సమానత్వ సిద్ధాంతం వెనుక ఉన్న నేపథ్యం, చారిత్రక విశేషం, ఇంకా క్రియా రూపం, ధాతు రూపం ఈ విధంగా అన్నింటినీ వివరించాడు. కనుక ఇప్పుడు అక్కడ సైద్ధాంతిక విభేదాలు అయితే లేవు. కానీ ఏం ఉండాలో అవి కూడా లేవు.. అంతా అనుకున్న సమానత్వం అక్కడ ఉందీ అనుకోవడంలో భ్రమ ఉంది. వాటి గురించి స్వామీజీ ఇప్పటికిప్పుడు నోరు మెదపరు కానీ నోరు తెరిచి వివరిస్తే ఎంత బాగుంటుంది. నిజాలన్నవి ఆ తెరచిన నోరులో ఆ విశ్వ రూప సాక్షాత్కారంలో తప్పక వెల్లడిలోకి వస్తాయి..వెలుగు చూస్తాయి కూడా!
ఇక వెయ్యి కోట్ల ఆశ్రమం, వంద ఎకరాలకు పైగా స్థలం, పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం మరియు ఆంధ్రా ప్రభుత్వ పెద్దల మద్దతుతో రూపుదిద్దుకున్న వైనం… ఇవన్నీ నభూతో! కానీ వీటిపై అటు ఆంధ్రా ప్రభుత్వం కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ మాట్లాడదు.
ఓ ఊరికి రోడ్డు వేసేందుకో లేదా ఓ బడికి మంచి వసతులు కల్పించేందుకో ఇంతటి చొరవను ఎన్నడూ ఇరు తెలుగు రాష్ట్రాల పాలకులు పాటించి ఉండరు.కానీ ఇప్పుడు మాత్రం స్వామీజీ ఆశ్రమానికి ఏం కావాలో ఆఘమేఘాల మీద అందిస్తున్నారు అన్న విమర్శ కూడా వినవస్తోంది.
ఆ విధంగా జగన్, ఆ విధంగా చెవిరెడ్డి, ఆ విధంగా విధిగా సాయి రెడ్డి, ఆ విధంగా విధి లీలలో భాగంగా కేసీఆర్, మేఘా కంపెనీ ప్రతినిధులు, మై హోం సంస్థ ప్రతినిధులు తరిస్తూ ఉన్నారు. అందుకనే ఆశ్రమ నిర్మాణం సుసాధ్యం అయింది. ఇదే సమయంలో రామోజీ తలపెట్టిన ఓం సిటీ ఏమైపోయిందని? ఆ రోజు ఆయన కలలుగన్న ఓం సిటీ స్థానంలోనే ముచ్చింతల్ లో జియరు స్వామి ఆశ్రమం నిర్మాణానికి నోచుకుందా లేదా తెలంగాణ పెద్దాయన ప్రోద్బలంతోనే పంతం పట్టి జియరు స్వామి రంగంలోకి దిగారా?
ఏదేమయినప్పటికీ రామోజీ తలపెట్టాల్సిన యజ్ఞాన్ని కేసీఆర్ తలపెట్టి పూర్తి చేయడమే ఈ కథలో ట్విస్టు. ఇందుకు జగన్ తో పాటు ఇంకొందరు పెద్దలు సహకరించడం ఇంకో ట్విస్టు. అక్కడ వైసీపీ, టీఆర్ఎస్ రెండూ సర్వం సమానం… వీరికి తెరవెనుక సాయం చేసిన బీజేపీని కూడా తక్కువ అంచనావేయలేం.
ఈ తరుణాన దేవుళ్లంతా ఒక్కటే… కానీ మనుషులే ఒక్కటిగా లేరు అన్న వేదన ఎలా ఉందో …అదే సమయాన నాయకులంతా ఒక్కటే కానీ ప్రజలే ఒక్కటిగా లేరు అన్న వాదన కూడా అంతే నిజం.
ఆఖరుగా రాజకీయ పార్టీలకు సంబంధించి వ్యక్తులు ఎవరు ఎలా ఉన్నా,ఎవరు ఎటువైపు ఉన్నా రామోజీ కలలు 2015లోనే ఆగిపోయాయి ..ఆయనకు చీకటే మిగిలింది.జియరు స్వామి కలలు 2022 తో ముగిశాయి..ఆయనకు ప్రభలు అందాయి.ఇదే సమయాన భ్రమలు తొలగాయి.ఏమంటారు కేసీఆర్ నిజమా? కాదా? ఏమంటారు జగన్ నిజమా? కాదా? ఏమో సర్ లోగట్టు ఆ విరాట్ మూర్తికే ఎరుక!