“ఎవ్వనిచే జనియించు..జగమెవ్వరి లోపల ఉండు లీనమై.. ఎవ్వని యెండుదిండు..“ అని భాగవతంలో పోతనమాత్యులు చెప్పినట్టు.. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని వినువీధుల ప్రసరింపజేసిన ఏకైక మనీషి.. తెలుగులోగిలి అన్న గారు ఎన్టీఆర్. ఆయన పుట్టుకే..ఒక అద్భుతం అన్నారట.. అప్పట్లో పండితులు. 1923, మే 28న కృష్ణాజిల్లాలోని నిమ్మకూరులో జన్మించారు. చదివింది బిఏనే అయినా.. సినీ రంగంలో తిరుగులేని రారాజుగా వెలిగారు.
అంతేకాదు.. అడుగుపెట్టిన ఏ రంగంలోనైనా ఎన్టీఆర్ నెంబర్‌వన్‌గా నిలిచారు. 33 ఏళ్ల సినీ ప్రయాణంలో అనితర సాధ్యమైన రికార్డులు సృష్టించారు. మరెవ్వరూ అందుకోలేనంత ఎత్తు ఎదిగారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమునిగా ఎనలేని కీర్తిగడించారు. రాజకీయాల్లోకి ప్రవేశించి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. పేదలు, బడుగువర్గాల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చి తెలుగుజాతి ఉన్నంతకాలం ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా ఒక శకాన్ని సృష్టించుకున్న శక పురుషుడు ఎన్టీఆర్.
`కొందరు పుడుతారు. మట్టిలో కలుస్తారు. కొందరు పుడతారు ధ్రువ తారలుగా నిలుస్తారు` అంటాడు ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపుడితో మాట్లాడుతూ.! అచ్చు ఈ కోవకు చెందిన వారే ఎన్టీఆర్. 60 ఏళ్లు నిండిపోయిన వయసులో ఎవరైనా ఏం చేస్తారు. విశ్రాంతి తీసుకుంటారు. జీవితం చరమాంకంలో పడిందని అనుకుంటారు. కానీ, ఎన్టీఆర్ జగజ్జేయమానంగా వెలిగిపోయింది అప్పటి నుంచే అంటే నమ్మలేం.
62 ఏళ్ల వయసులో ఆయన పార్టీ పెట్టారు. ఊరూ వాడా .. తిరిగారు తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ స్థాయికి చేర్చారు. నేడు ఆయన మన మధ్య లేకపోయినా.. ఆయన వేసిన బాటలు తెలుగు వారిని నడిపిస్తున్నాయి. కష్ట కాలంలో వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నాయి. దటీజ్ ఎన్టీఆర్.. దటీజ్ ఎన్టీఆర్!!