గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో ‘ఎన్టీఆర్’ విగ్రహం ధ్వసం యత్నం వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. మాచర్ల నియోజకవర్గ పరిధిలోని దుర్గి గ్రామంలో ‘ఎన్టీఆర్’ విగ్రహాన్ని కోటేశ్వరరావు అనే వ్యక్తి సుత్తితో ధ్వసం చేయడానికి యత్నించడం పెను దుమారం రేపింది. వైసీపీ కార్యకర్త కుమారుడైన కోటేశ్వరరావు మద్యం మత్తులో పట్టపగలే ఈ దారుణానికి ఒడిగట్టాడని ఆరోపణలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఈ ఘటనను భారత దేశంలోని టీడీపీ నేతలు, కార్యకర్తలతోపాటు ఎన్నారై టీడీపీ నేతలు కూడా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ ఘటనను అమెరికాలో ప్రముఖ ప్రవాసాంధ్రుడు, టీడీపీ ఎన్నారై నేత, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రతినిధి, తానా మాజీ అధ్యక్షుడు ‘జయరాం కోమటి’ తీవ్రంగా ఖండించారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన అన్నగారి విగ్రహంపై ఈ అమానుష ఘటన దారుణమని మండిపడ్డారు.ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ‘జయరాం కోమటి’ డిమాండ్ చేశారు.
మరోవైపు, ఈ ఘటన నేపథ్యంలో ఏపీవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. మాచర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్దీం జూలకంటి బ్రహ్మారెడ్డి సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే దుర్గిలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో, దుర్గిలో 144 సెక్షన్ విధించారు.