ఆంధ్రుల ఆరాధ్య నటుడు, ప్రజా నాయకుడు.. తెలుగు వారికి ‘అన్న’ ఎన్టీఆర్ పేరును తొలగిస్తూ ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా రాజధాని వాషింగ్టన్ డీ సి మెట్రో ప్రాంతంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగు వారందరూ ముక్తకంఠంతో ఖండిస్తూ నిరసన కార్యక్రమం జరిగింది. దీనికి భాను మాగులూరి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ: జగన్ కు పేర్లు, రంగుల పిచ్చి పరాకాష్టకు చేరింది అన్నారు. పిచ్చి ముదరడంతో ఏది కనిపిస్తే దానికి పార్టీ రంగులు పూయడం లేదా తన పేరో, తన తండ్రి పేరో పెడుతున్నాడు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చటం ఇదొక చారిత్రిక తప్పిదం. జగన్ మెడకు ఇది ఉరితాడు అవుతుంది. వైద్య విద్యకు ప్రత్యేక యూనివర్సిటీ ఉండాలి. వైద్య విద్య ప్రమాణాలు పెంచాలనే ఉన్నతమైన ఆలోచనలతో 36 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ దీన్ని ప్రారంభించారు. కానీ ఎన్టీఆర్ తన పేరు పెట్టుకోలేదు. ఆయన మరణానంతరం ఆయన పేరు పెట్టడం జరిగింది. ఇప్పటికే జగన్ రెడ్డి అనేక ప్రభుత్వ పథకాలకు తన సొంత పేర్లు పెట్టుకోవడం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా సుమారు 90 పథకాలకు పేర్లు మార్చి తన తండ్రి పేరు, తన పేరు పెట్టుకొని జబ్బలు చరుచుకుంటావున్నాడు. ఏదైనా కొన్ని కొత్త ప్రాజెక్టులు నిర్మించి… లేదా ఇంకా గొప్ప పధకాలు రూపొందించి తన తండ్రి పేరు, తన పేరు పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలా వున్న పేర్లు తొలగించి ఏమాత్రం సంబంధం లేని వైఎస్సార్ పేరు పెట్టడం ముమ్మాటికీ సమంజసం కాదని ఉద్ఘాటించారు.
భాను మాగులూరి మాట్లాడుతూ, ఇది దివంగత నేత వైఎస్సార్ కి కూడా గౌరవం తెచ్చిపెట్టే అంశం ఏమాత్రం కాదు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. అధికార మార్పిడితో పాటు పేర్లు కూడా పూర్తిగా మారిపోతాయా? ఇలాగే గతంలో శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరును తొలగించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఇలానే అలోచించి ఉంటే వైఎస్సార్ జ్ఞాపకాలు ఏమి మిగిలేవి కావు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుపుతున్న వేళ తెలుగువారందరిని అవమానపరిచేవిధంగా వుంది. పేరు మార్చినంత మాత్రాన ఎన్టీఆర్ చరిత్రను, కోట్లాదిమంది ప్రజల హృదయాలలో వున్న అభిమానాన్ని చెరిపివేయలేరు. తెలుగువారి ఆత్మా గౌరవానికి ప్రతీకగా నిలిచి…. తెలుగువారి శాశ్వత గుండె చప్పుడుగా మిగిలిపోయారని తెలిపారు.
ఇలాంటి సామజిక ఉద్యమ నిర్మాత పేరు మార్చి జగన్ రెడ్డి చరిత్ర హీనుడుగా మిగిలిపోయాడు అని ధూళిపాళ్ల వీరనారాయణ చెప్పారు. పాల్గొన్న అనేకమంది పెద్దలు, యువకులు మాట్లాడుతూ కులం, మతం, ప్రాంతాల కతీతంగా అన్న ఎన్టీఆర్ సమాజ సేవ చేశారని, అలాంటి వారి పేరును మార్చటం ముమ్మాటికీ సబబు కాదు.. సామాన్య ప్రజలు కూడా దీన్ని ఏమాత్రం ఒప్పుకోరని, దీనిని ఉపసంహరించుకోకపోతే తెలుగు ప్రజల ఆగ్రహానికి గురవుతారు. అంతే గాక ప్రజా న్యాయస్థానంలో దోషిగా నిలబడి మరోసారి చీవాట్లు తినక తప్పదు అన్నారు.. ఈ కార్యక్రమంలో సీతారామారావు, పురుషోత్తమరావు, బసవరావు, సిద్దార్ధ్, నాగశంకర్, వినీల్ తదితరులు పాల్గొన్నారు.